
ఢిల్లీ పంద్రాగస్టు వేడుకలకు సర్పంచ్ ప్రశాంతికి ఆహ్వానం
ఎస్.రాయవరం : ఢిల్లీలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు ఆహ్వానం అందుకున్న పెట్టుగోళ్లపల్లి సర్పంచ్ అల్లు వెంకట ప్రశాంతికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దినందుకు ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చిందని సర్పంచ్ వెంకట ప్రశాంతి తెలిపారు. పెట్టుగోళ్లపల్లి గ్రామంలో ఐదు దశాబ్దాలుగా అల్లువారి కుటుంబం నుంచి సర్పంచ్‌లుగా సేవలందించి గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర వహించారు. 2021లో తాను సర్పంచ్‌గా ఎన్నికై అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్టు అల్లు ప్రశాంతి తెలిపారు. గ్రామంలో ప్రకృతి వ్యసాయంలో శిక్షణ ఇవ్వడంతో సుమారు 70 ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు రూ.23 లక్షలతో, ప్రస్తుత ప్రభుత్వంలో ఎస్‌ఎస్‌ఏ నుంచి రూ.15 లక్షలతో ప్రహరీ, ఎస్‌డీఎఫ్ గ్రాంటు రూ.3 లక్షలతో ఆడిటోరియం వంటి నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఢిల్లీ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషకరంగా ఉందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు.