
రానున్న 15 రోజులు వరినాట్లకు కీలకం
అనకాపల్లి: ఖరీఫ్ సీజన్‌లో మే, జూన్ నెలల్లో ఆశించని వర్షాలు కురిసినప్పటికీ వరినాట్లు పూర్తి చేసేందుకు రాబోయే పక్షం రోజులు కీలకమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు తెలిపారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఏస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన టి అండ్ వి వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. మే, జూన్ నెలల్లో జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు పడ్డాయన్నారు. జులైలో సాధారణ వర్షపాతంలో సగం నమోదైన కారణంగా వరినాట్లు వేసుకోవడానికి వాతావరణం అనుకూలంగా లేదని పేర్కొన్నారు. రానున్న 15 రోజుల్లో ఆశించిన వర్షాలు కురిస్తే రైతులు వరినాట్లు వేసుకునేందుకు అనువుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రతినిధి శ్రీధర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ కె.వి.రమణమూరి, ఆదిలక్ష్మి, విశాలాక్షి, డి.ఉమామహేశ్వరరావు, సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.