
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్ల దుస్థితి
● చోడవరం రోడ్ల దుస్థితిపై కోర్టుకు నివేదించిన ప్రభుత్వ అధికారులు ● రోడ్డు కాంట్రాక్టర్, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు నోటీసు జారీచేసేందుకు కోర్టు ఆదేశం ● వచ్చే నెల 23న మరోసారి హాజరుకావాలన్న 9వ ఏడీజే కోర్టు ● వివరాలు వెల్లండించిన పిటిషనర్ తరపు న్యాయవాది డేవిడ్
చోడవరం : రోడ్లు బాగుచేయాలంటూ న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై కోర్టు ముందు ఆర్‌అండ్‌బీ జిల్లా అధికారులు శనివారం హాజరయ్యారు. సబ్బవరం నుంచి వయా చోడవరం, వడ్డాది, కొత్తకోట,రోలుగుంట మీదుగా మెయిన్‌రోడ్డు (బీఎన్‌రోడ్డు), అనకాపల్లి–మాడుగుల ఆర్‌అండ్‌బీ రోడ్లు చాలా అధ్వానంగా గోతులు పడి ఉన్నాయని, వీటిని ఎందుకు బాగుచేయించలేదో తెలపాలంటూ ఈనెల 7వతేదీన చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టులో చోడవరానికి చెందిన న్యాయవాదులు అన్నాబత్తుల భరత్ భూషణ్, భూపతిరాజు పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కలెక్టర్‌తోపాటు ఏడుగురు మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేయగా, వారు శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. కలెక్టర్ తరఫున ఆర్‌అండ్‌బీ ఈఈ సాంబశివరావు, ఏఈ సత్యప్రసాద్ హాజరయ్యారు. ఈ పిటీషన్‌కు సంబంధించి వివరాలను పిటీషనర్ తరపున న్యాయవాది, చోడవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ విలేకరులకు వెల్లడించారు. ఈ రెండు రోడ్లు ఎందుకు బాగుచేయాలేదన్న విషయమై ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిబంధనలు ప్రకారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని డేవిడ్ చెప్పారు. ప్రజలకు కల్పించవలసిన ప్రాథమిక సదుపాయాలు సెక్షన్ 12ను అనుసరించి పిటిషన్ వేయడం జరిగిందన్నారు. చాలా యేళ్లుగా ఈ రోడ్లకు నిర్వహణ పనులు చేపట్టకపోడం వల్ల బాగా దెబ్బతిన్నాయని, ప్రస్తుతం పెద్దపెద్ద గోతులు పూడ్చే పనులు చేపట్టామని అధికారులు కోర్టుకు వివరించారన్నారు. పూర్తిగా గోతులన్నీ పూడ్చడానికి చర్యలు చేపట్టామని వారు చెప్పినట్టు న్యాయవాది డేవిడ్ చెప్పారు. గోతులు పూడ్చడంతోపాటు పూర్తిస్థాయి రోడ్డును వేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టారని లీగల్ అథారిటీ వారు ప్రశ్నించారన్నారు. రోడ్డు కాంట్రాక్టర్ ఎ.అశ్వంత్ అనే వ్యక్తి నిర్లక్ష్యం వల్లే రోడ్లు సకాలంలో వేయలేకపోయామని అధికారులు తెలిపారని న్యాయవాది చెప్పారు. ఈ కాంట్రాక్టర్‌తో పనిచేయించే అధికారం తమకు లేదని, ఎన్‌డీబీ ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న చీఫ్ ఇంజినీర్‌కు మాత్రమే అధికారం ఉంటుందని జిల్లా అధికారులు చెప్పడంతో సదరు కాంట్రాక్టర్, చీఫ్ ఇంజినీర్ (విజయవాడ) వ్యక్తిగతంగా ఆగస్టు 23వతేదీన కోర్టుకు హాజరుకావాలని అథారిటీ చైర్మన్ అదేశించారని న్యాయవాది చెప్పారు. వీరికి నోటీసులు వెంటనే పంపాలని సిబ్బందిని కోర్టు ఆదేశించిదన్నారు. వీరి సమాధానాన్ని బట్టి రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అవసరమైతే హైకోర్టుకు కూడా వెళతామని పిటీషనర్ తరపు న్యాయవాది డేవిడ్ చెప్పారు.