
ఏడాదైనా రాని కొత్త పింఛన్లు
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా వృద్ధులకు,దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరాపల్లి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం మాట్లాడుతూ కొత్త పింఛన్ల కోసం ఎంతో మంది అర్హులైన వృద్ధులు,దివ్యాంగులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దీని వల్ల ఎంతో మంది అర్హులైన అవ్వాతాతలు,దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వారికి ఇప్పటి వరకు ఎంతమందికి పింఛన్లు ఇచ్చారో తెలియజేయాలని కోరారు.కూటమి సర్కార్ అధికారం చేపట్టి ఏడాది అయినా ఇంకా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం ఏంటిని ప్రశ్నించారు. గొలుగొండ జెడ్పీటీసీ గిరిబాబు మాట్లాడుతూ తక్షణం పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఎస్సీ, బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాల ని దేవరాపల్లి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం కోరారు.
అందుబాటులో ఉండని 108 వాహనాలు
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 108 వాహనాలు సక్రమంగా పనిచేయడం లేదని, రోగులకు అందుబాటులో ఉండడం లేదని సభ్యులు అవేదన వ్యక్తం చేశారు. కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ 108 వాహనాలు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో గైనిక్ సేవలు సక్రమంగా లేవని సభ్యురాలు సత్యవతి తెలిపారు.
జెడ్పీటీసీ సభ్యుల ఆవేదన
జెడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశాలు

ఏడాదైనా రాని కొత్త పింఛన్లు