రేషన్ బండిపై రాజకీయ కక్ష
దేవరాపల్లి: పేద ప్రజల అవస్థలను తొలగిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే రేషన్ వ్యవస్థను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా రద్దు చేయడం అత్యంత దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. ఈ మేరకు దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టారనే రాజకీయ దురుద్దేశంతో పేదల ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తున్న ఎండీయూల వ్యవస్థను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. పేద ప్రజలు పనులు మానుకొని రోజంతా రేషన్ డిపోల దగ్గర క్యూలో పడిగాపులు కాస్తూ అవస్థలు పడకూడదన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఎండీయూ వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. రేషన్ డిపోల ద్వారా పాత
పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కోసం కూలి పనులు మానుకోవాల్సిన దుస్థితి దాపరిస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా పేదలకు నిత్యావసర సరకులు అందిస్తున్న ఎండీయూ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం ఎందుకు అంత కర్కశంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయలేదు సరికదా.. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలతో పాటు పలు సేవలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వేలాది మంది ఎండీయూ ఆపరేటర్లు, సహాయకుల కుటుంబాలు రోడ్డు పడతాయని బూడి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి నిర్ణయాలను మానుకోవాలని హితవు పలికారు.
విప్లవాత్మక డోర్ డెలివరీ వ్యవస్థ నిలిపివేత దారుణం
కూటమి ప్రభుత్వం నిర్ణయంతోప్రజలకు మళ్లీ పాట్లు
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం


