జూలో ఉత్సాహంగాసమ్మర్ క్యాంప్
ఆరిలోవ (విశాఖ): ఇందిరాగాంధీ జూ పార్కులో బుధవారం పాఠశాల పిల్లలకు సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. జూ పార్కుతోపాటు జీవీఎంసీ, వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, గ్రీన్ పాజ్, యూత్ కన్సర్వేషన్ యాక్షన్ నెట్‌వర్క్ సంయుక్తంగా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ శిబిరంలో నగరంలో పలు పాఠశాలలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి రోజు వారికి పక్షుల వీక్షణ నిర్వహించారు. జూలో ఉన్న పక్షులతోపాటు లోపల సహజ వాతావరణంలో చెట్లపై తిరిగే వివిధ రకాల పక్షులను పిల్లలు తిలకించారు. వాటి గురించి జూ ఎడ్యుకేషన్ సిబ్బంది చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి.మంగమ్మ మాట్లాడుతూ పిల్లలకు వన్యప్రాణులపై అవగాహన కల్పించడానికి సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణులు, వాటి జీవిత విశేషాలు, ఆహార అలవాట్లు, పర్యావరణానికి వాటి ఉపయోగం తదితర అంశాల గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తామన్నారు.


