కూటమిలోడిప్యూటీ చిచ్చు | - | Sakshi
Sakshi News home page

కూటమిలోడిప్యూటీ చిచ్చు

May 20 2025 1:22 AM | Updated on May 20 2025 1:22 AM

కూటమి

కూటమిలోడిప్యూటీ చిచ్చు

● జనసేనకు డిప్యూటీ మేయర్‌ కేటాయింపుపైససేమిరా అంటున్న టీడీపీ నేతలు ● 22 రోజుల క్రితం ఉన్న ఐక్యత ‘కౌన్సిల్‌ సాక్షిగా’ భగ్నం ● కూటమి పార్టీల్లో బయటపడ్డ లుకలుకలు

డాబాగార్డెన్స్‌ (విశాఖ): ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేది నానుడి. దీనికి తగ్గట్టుగానే జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ పదవి టీడీపీ, జనసేన మధ్య చిచ్చురేపింది. మొన్నటి మేయర్‌ ఎన్నిక వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇరుపార్టీల నేతల్లో అసహనం వ్యక్తమైంది. ఇన్నాళ్లూ కూటమి పార్టీలంతా ఒక్కటేనని బయటకు చెబుతున్నా.. ఈ ఎన్నిక సందర్భంగా లుకలుకలు బయటపడ్డాయి. సంఖ్యాబలం ఉండి కూడా కోరం లేక సమావేశం వాయిదా పడిందంటే.. ఐక్యత ఎంత మేర ఉందో అర్థమవుతోంది. మేయర్‌గా పీలా శ్రీనివాసరావును కూటమి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సమయంలోనే డిప్యూటీ మేయర్‌ పదవి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. టీడీపీ ఆశావాహులు మాత్రం గత వారం రోజులుగా ఈ పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తనకే పదవి వచ్చేలా చూడాలంటూ శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే జనసేన పార్టీకే డిప్యూటీ మేయర్‌ పదవి కేటాయించారు. ఆ పార్టీకి చెందిన 64వ వార్డు కార్పొరేటర్‌ దల్లి గోవిందరెడ్డికి ఆ పార్టీ నేతలు బీ ఫారం అందజేశారు.

కారాలు మిరియాలు

జనసేనకు చెందిన దల్లి గోవిందరెడ్డికి బీ ఫారం ఇవ్వడంతో టీడీపీ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో భేటీ అయిన టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. హోటల్‌ నుంచి ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు వేరే చోటికి వెళ్లిపోయారు. ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశానికి హాజరైనా.. కోరానికి సరిపడా సభ్యులు లేకపోవడంతో జనసేన ఆశలు ఆవిరైనట్టయింది. దీంతో ఇరు పార్టీల నేతలు కారాలు మిరియాలు నూరుకున్నారు.

జంప్‌ జిలానీలు డీలా..స్వార్థ రాజకీయాలు, డబ్బు లకు అమ్ముడుపోయి వైఎస్సార్‌ సీపీ నుంచి జనసేనలో చేరిన కార్పొరేటర్లు, ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు వారు ఆశించినట్టు సాగకపోవడంతో తెల్ల మొహాలు వేసినట్టయింది. ఎందుకు పార్టీని వీడామని మధనపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇంతలోనే ఎంత తేడా..!

గత నెల 28న మేయర్‌ ఎన్నిక నిర్వహించారు. కుట్రలు, కుతంత్రాలతో నిర్వహించిన ఎన్నికలో పీలా శ్రీనివాస్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 22 రోజుల తర్వాత నిర్వహించిన డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో కూటమి పార్టీల్లో లుకలుకలు బయటపడ్డాయి. కేవలం అధికారం కోసం ఏర్పడిన పొత్తు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు.

దల్లిపై ఎన్ని ఫిర్యాదులో..

డిప్యూటీ మేయర్‌ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్‌ సీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు కార్పొరేటర్లు.. తొలి నుంచి జనసేన పార్టీలో ఉన్న దల్లి గోవిందరెడ్డిపై అధిష్టానానికి పలు ఫిర్యాదులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దల్లి గోవిందరెడ్డి గుట్కా వ్యాపారితో అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అవి అవాస్తవమని తెలియడంతో పార్టీ అధిష్టానం దల్లి గోవిందరెడ్డికే డిప్యూటీ మేయర్‌ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపింది. బీ ఫారం అందజేయడంతో ఆ పార్టీలో చేరిన వారంతా కంగుతిన్నట్టయింది.

టీడీపీలో ముసలం పెట్టిందే వీరే..

డిప్యూటీ మేయర్‌ ఎన్నిక విషయంలో మేయర్‌ పీలా శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు ముసలం పెట్టారని ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు బాహాటంగా అంటున్నారు. మేయర్‌ గంధం శ్రీనివాస్‌కు, వెలగపూడి యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్‌ మంగవేణికి, గంటా భీమిలి నియోజకవర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్‌ మొల్లి హేమలతకు హామీ ఇచ్చి వారిలో ఆశలు రేకెత్తించారనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి.

కూటమిలోడిప్యూటీ చిచ్చు 1
1/1

కూటమిలోడిప్యూటీ చిచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement