కొప్పుల వెలమలను ‘బీసీఏ’లో చేర్చాలి | Sakshi
Sakshi News home page

కొప్పుల వెలమలను ‘బీసీఏ’లో చేర్చాలి

Published Mon, Dec 4 2023 12:56 AM

కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ 
నాయుడుబాబును సత్కరిస్తున్న సంఘ ప్రతినిధులు  - Sakshi

చోడవరం: వెనుకబడిన కొప్పుల వెలమ కులాన్ని బీసీ ఏ రిజర్వేషన్‌ కేటగిరీలో చేర్చాలన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు అన్నారు. చోడవరం నియోజకవర్గం వెలమ సంక్షేమ సంఘం వన సమారాధన కార్యక్రమం అడ్డూరులో ఆదివారం జరిగింది. ఈ వన సమారాధనకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో కొప్పుల వెలమ కులస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయుడుబాబు మాట్లాడుతూ కొన్ని కులాలను బీసీడీలో చేర్చడం వల్ల ఈ కేటగిరిలో ఉన్న కొప్పుల వెలమలకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనివల్ల అన్ని రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్న కొప్పుల వెలమ కులాన్ని బీసీ ఏ కేటగిరిలో రిజర్వేషన్‌ కల్పించే విధంగా సమావేశం చేసిన తీర్మానం మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నాయుడుబాబు చెప్పారు. సామాజికంగా పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ రాజకీయ పరంగా ఇంకా తగినంత గుర్తింపు లేదని, ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమలకు ఒక రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్‌ పోస్టులు కూడా ఇవ్వాలని సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని నాయుడుబాబు అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కొప్పుల వెలమలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయలేదని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే ఈ కులాన్ని గుర్తించి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందన్నారు. నవరత్నాల వైస్‌ చైర్మన్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన నరవత్నాల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, అనేక పథకాలు అమలు చేసిందని, ఈ పథకాల్లో కొప్పుల వెలమ కులస్తులకు కూడా ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. కొప్పుల వెలమ సంక్షేమ సంఘం ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ శ్రీనువాసులునాయుడు, గోవాడ సుగర్స్‌ మాజీ చైర్మన్‌ గూనూరు మల్లునాయుడు, బీజేపీ రాష్ట్ర స్పోక్స్‌ పర్సన్‌ ఈర్లె శ్రీరామ్మూర్తి, రైల్వే బోర్డు మెంబరు బొడ్డు శ్రీరామ్మూర్తి, జెడ్పీటీసీ పోతల లక్ష్మీశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement