ముంచంగిపుట్టు: మండలంలోని 23 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను గురువారం రూట్ అధికారులు పరిశీలించారు. ముఖ్యంగా అత్యంత మారుమూల ప్రాంతాల్లోని భూసిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు, బాబుశాల, లక్ష్మీపురం, కుమడ, దొడిపుట్టు, వనుగుమ్మ పంచాయతీల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు, సౌకర్యాలను తనిఖీ చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి కల్పించాల్సిన సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీసులతో చర్చించారు. రూట్ అధికారులు పోలింగ్ కేంద్రాల పరిశీలన అనంతరం సమర్పించే నివేదిక ఆధారంగా పోలీసులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తదుపరి ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టనున్నారు.


