సీలేరు: గూడెం కొత్తవీధి మండలంలో తొలివిడతగా నిర్వహించిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు పలు పంచాయతీల్లో విజయాలు సాధించారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ పోటాపోటీగా తలపడి సత్తాచాటారు. మారుమూల అటవీ ప్రాంతమైన గాలికొండ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన పోత్తూరు రాజులమ్మ సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆరు వార్డు సభ్యుల స్థానాలను కూడా ఆ పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారు. గుమ్మరేవుల పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడిగా బరిలోకి దిగిన రెబల్ అభ్యర్థి బోరంగి వెంకట్రావు 277 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ పంచాయతీలో వరుసగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే సర్పంచ్‌లుగా విజయం సాధిస్తుండటం విశేషం.
దారకొండ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన మడకం గంగాభవాని కూటమి మద్దతుదారుపై 225 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ పంచాయతీలో ఐదు వార్డు సభ్యుల స్థానాలను కూడా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు.
మాజీ సర్పంచ్‌కు మరోసారి విజయం
దుప్పులవాడ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అల్లంకి రాజు విజయం సాధించారు. పదేళ్ల క్రితం ఇదే పంచాయతీకి సర్పంచ్‌గా పనిచేసిన ఆయన మరోసారి ఎన్నికల్లో గెలుపొందడం విశేషం. సీలేరు మేజర్ పంచాయతీలో కూటమి మద్దతుతో బరిలోకి దిగిన వంతల దీనమణి సర్పంచ్‌గా విజయం సాధించారు. వార్డు సభ్యులంతా నక్క జ్ఞానేశ్వరరావును ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు.
విజయోత్సవ ర్యాలీలతో సందడి
గూడెం కొత్తవీధి మండలంలోని 16 పంచాయతీల్లో పలుచోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందుకున్న వెంటనే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా పేల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులతో త్వరలోనే ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీలేరు పంచాయతీ కార్యదర్శి పరశురామ్ తెలిపారు.


