సీలేరు: గూడెం కొత్తవీధి మండలంలోని మారుమూల అటవీ ప్రాంత పంచాయతీల్లో గురువారం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీలేరు పోలీస్‌స్టేషన్ సిబ్బంది ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామాల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సీలేరు, దుప్పులవాడ, గుమ్మరేవుల, అమ్మవారి దారకొండ పంచాయతీ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా కొనసాగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అనంతరం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు అభ్యర్థుల సహనానికి పరీక్షగా మారింది. వార్డుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తొలుత వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు చేపట్టి, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించారు. దీంతో లెక్కింపు ప్రక్రియ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది.
చీకట్లోనే తిరుగు ప్రయాణం
ఏజెన్సీలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మారుమూల పంచాయతీలు ఉండటంతో ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల సిబ్బంది తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. సీలేరు, దుప్పులవాడ, గుమ్మరేవుల, దారకొండ పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. లెక్కింపు, తదనంతర ప్రక్రియ పూర్తయ్యాక రాత్రి 7 గంటల తర్వాత సిబ్బంది చీకట్లోనే తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. సీఐ సుధాకర్, సీలేరు ఎస్‌ఐ యాసిన్ బందోబస్తు పర్యవేక్షించారు.


