అనుకోని అవకాశం
ముంచంగిపుట్టు: ముగ్గురు పిల్లలున్నారనే కారణంతో జెడ్పీటీసీ టికెట్ దక్కని చోట.. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆమెకు అదే అవకాశం రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రైవేట్ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేసిన జల్లిపల్లి సుభద్ర.. తొలి ప్రయత్నంలోనే జెడ్పీటీసీగా పోటీ చేసి 1,957 ఓట్ల మెజారిటీతో గెలుపొందడమే కాకుండా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించారు.
● సాధారణ పీవీటీజీ గిరిజన కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఆమె ప్రస్థానం.. అనూహ్య రాజకీయ అవకాశం, పట్టుదలతో సాగిన ప్రయాణానికి నిదర్శనం.
వ్యవసాయ కుటుంబం నుంచి..
ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామానికి చెందిన అరబీరా గాసి, చంద్రకళ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో చివరి సంతానమైన సుభ ద్ర తండ్రి వ్యవసాయం చేయగా, తల్లి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. 2005లో ముంచంగిపుట్టుకు చెందిన జల్లిపల్లి వెంకట వరహనరసింహమూర్తిని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి సోనాలి అనే కుమార్తె ఉంది. సుభద్ర సోదరు డు జగబంధు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేసేవారు. 2021లో ముంచంగిపుట్టు జెడ్పీటీసీ టికెట్ తొలుత ఆయన భార్యకు కేటాయించినప్పటికీ, ముగ్గురు పిల్లలు ఉండటంతో పోటీకి అవకాశం లేకపోయింది. దీంతో తన సోదరి సుభద్రను ఎన్నికల బరిలో నిలిపారు. ఆ అనూహ్య పరిణామమే ఆమె రాజకీయ జీవితానికి తొలి మెట్టయింది.
జెడ్పీ పీఠం నుంచి ప్రజాక్షేత్రం వరకు..
ముంచంగిపుట్టు జెడ్పీటీసీగా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన సుభద్రకు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. ఆ బాధ్యతలను నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొంటూ, మారుమూల గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. అనూహ్యంగా లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకుని జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రభుత్వ బడుల్లో చదివి..
లబ్బూరు, బంగారుమెట్ట, ముంచంగిపుట్టులోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన సుభద్ర.. పాడేరులో డిగ్రీ, చోడవరంలో బీఈడీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ పూర్తి చేశారు. కుటుంబ పోషణ కోసం పాడేరులోని ప్రైవేట్ పాఠశాలలో రెండేళ్లపాటు తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలన్న ఆకాంక్ష నెరవేరకపోయినా.. అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాప్రతినిధిగా ఎదిగారు.
ప్రభుత్వ బడుల్లో విద్యాభ్యాస
ఉపాధ్యాయినిగా ఉద్యోగం
గిరిజన కుటుంబం నుంచిజిల్లాపరిషత్ పీఠం వరకు!
స్ఫూర్తిదాయకం
జల్లిపల్లి సుభద్ర రాజకీయ ప్రస్థానం


