● సరికొత్తగా జపాన్ తరహా పూల తోట
● గిరిజనుల భాగస్వామ్యంతో ఎకరా భూమిలో పూల సాగు
● వ్యూపాయింట్,
ఫొటో షూట్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు
● రేపటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి..
విరబూసిన కాస్మో పూల మధ్య ఏర్పాటు చేసిన ఊయల
సాక్షి, పాడేరు: పసుపు రంగు వలిసె పూల అందాలకే పేరుగాంచిన ఆంధ్ర ఊటీ అరకులోయలో జపాన్ తరహా కాస్మో పూలు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. జపాన్ ఫ్లవర్ గార్డెన్ పేరుతో విజయవాడకు చెందిన డాక్టర్ వి.వి.వేణుమాధవ్ రంగురంగుల కాస్మో పూలను మన్యం సందర్శించే పర్యాటకులకు సరికొత్తగా పరిచయం చేస్తున్నారు.
ఎకరా భూమిలో పూల సాగు
అరకులోయ శివారులోని బోసుబెడ పాఠశాలకు ఎదురుగా, విశాఖపట్నం వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని ఎకరా భూమిలో గిరిజనుల భాగస్వామ్యంతో జపాన్ ఫ్లవర్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి కాస్మో పూల విత్తనాలను తీసుకొచ్చి రెండు నెలల క్రితం నాటారు. ప్రస్తుతం తెలుపు, గులాబీ, వైలెట్ రంగుల్లో కాస్మో పూలు విరబూసి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే తోటలో వివిధ రంగుల టెంకాస్ పూలతో పాటు స్థానికంగా ప్రసిద్ధి చెందిన పసుపు రంగు వలిసె పూలు, పొద్దుతిరుగుడు మొక్కలను కూడా వేర్వేరు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. టెంకాస్ పూలు వికసించడం ప్రారంభించగా, వలిసె, పొద్దుతిరుగుడు మొక్కలు మొగ్గ దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరు నాటికి అవి కూడా పూలతో విరబూయనున్నాయి.
ఫొటో షూట్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు
అరకులోయ ప్రాంతాన్ని ప్రతి ఏటా పర్యాటక సీజన్‌లో లక్షలాది మంది సందర్శిస్తుంటారు. ముఖ్యంగా వలిసె పూల తోటల్లో ఫొటోలు దిగేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఈ ఏడాది వారికి కాస్మో పూలు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. రహదారి పక్కనే రంగురంగుల పూలతో కళకళలాడుతున్న ఈ తోటలో పర్యాటకుల కోసం వ్యూపాయింట్, ఫొటో షూట్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి జపాన్ ఫ్లవర్ గార్డెన్‌ను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.


