● భవిష్యత్ డీఎస్సీలోనైనాగిరిజన యువతకు న్యాయం చేయాలి
● మాజీ జెడ్పీటీసీ బాలయ్యపడాల్
చింతపల్లి: కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టనున్న డీఎస్సీలోనైనా గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందా? అని మాజీ జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్ ప్రశ్నించారు. శనివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ జీవో నం.3 రద్దు కావడంతో గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో జీవో నం.3ను పునరుద్ధరిస్తామని ప్రకటించి రెండేళ్లు దాటుతున్నా, ప్రత్యామ్నాయ మార్గంలో దానిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. మన్యంలో గిరిజన చట్టాల పరిరక్షణ కోసం నిరుద్యోగులు, మేధావులు, వివిధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడంతో, ఆ ఉద్యమాలను చల్లార్చే ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపించారు. అయితే, ప్రకటనలు చేయడం తప్ప జీవో పునరుద్ధరణకు కార్యాచరణ చేపట్టడం లేదన్నారు. జీవో నం.3 సాధన కోసం గతంలో కంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, నిరుద్యోగులు సమాయత్తమై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని బాలయ్యపడాల్ కోరారు.


