చింతపల్లి: విద్యార్థులు అభ్యసిస్తున్న సాంకేతిక విద్య భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహదపడుతుందని పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సమిరెడ్డి మాణిక్యం అన్నారు. శనివారం స్థానిక నివాసానుబంధ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఆర్‌ఐటీఐ)లో ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో కాన్వొకేషన్, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాణిక్యం మాట్లాడుతూ ప్రస్తుత శాస్త్ర, సాంకేతిక పోటీ ప్రపంచంలో విద్యార్థులు అభ్యసిస్తున్న సాంకేతిక శిక్షణ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు. విద్యార్థులు ప్రస్తుత సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాము అభ్యసిస్తున్న విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్నారు. ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సాంకేతిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంస్థలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సూపరింటెండెంట్ నాని రూ.10 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బాలరాజుదొర, శిక్షణ అధికారి రమణ, సిబ్బంది సతీష్, సాగర్, రణదీప్, సుజాత, వెంకన్నదొర, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


