ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం

Oct 11 2026 12:27 AM | Updated on Oct 11 2026 12:27 AM

డుంబ్రిగూడ: కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. మండలంలోని కితలంగి పంచాయతీ పరిధి వయా గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలు, బూత్‌ కమిటీల బలోపేతం, పార్టీ నాయకులకు ఐడీ కార్డుల పంపిణీపై పంచాయతీ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి నాయకుల హామీలకు, జగనన్న సంక్షేమ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజామోదం పొందిన, గ్రామాభివృద్ధికి కృషి చేసే, పార్టీ కోసం కష్టపడే, ప్రలోభాలకు లొంగని వ్యక్తులను కార్యకర్తలే ఎంపిక చేసి తీసుకురావాలని సూచించారు. అటువంటి అభ్యర్థులకే పార్టీ టికెట్‌ బీ–ఫారం ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

జగనన్న హయాంలో అమ్మఒడి కింద రూ.15 వేలు అందిస్తే, కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో రూ.13 వేలకు తగ్గించి, ఈ పథకాన్ని తామే తీసుకొచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైతు భరోసా కింద గతంలో రూ.13,500 అందించగా, కూటమి ప్రభుత్వం రైతులకు 13 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 45 ఏళ్లకే మహిళలకు ఏడాదికి రూ.18 వేల ఆర్థిక సాయం అందించిన ఘనత జగనన్నదేనని పేర్కొన్నారు.

పాస్టర్లు, చేనేత కార్మికులు, టైలర్లు, ఆటో, జీపు డ్రైవర్లకు గౌరవ వేతనాలు అందించిన చరిత్ర జగన్‌కే ఉందన్నారు. జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలకు రూ.2 లక్షల సాయం, ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు అందించే చర్యలు చేపట్టారని తెలిపారు. 2029లో జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్‌, మండల కార్యదర్శులు మఠం శంకర్‌, రామునాయుడు, మోహన్‌, మాజీ వైస్‌ ఎంపీపీ శెట్టి ఆనందరావు, మాజీ సర్పంచులు కె.హరి, గుమ్మ నాగేశ్వరరావు, వై.సుబ్బారావు, నాయకులు టి.రాందాసు, తుమ్నాద్‌, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కితలంగి పంచాయతీ సమావేశంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement