సాక్షి, పాడేరు: రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాడేరులోని వైద్య ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించి, వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ వాయిద్యమైన తుడుంతో పాటు డప్పు వాయించి ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైద్య ఉద్యోగులు సమ్మె బాట పట్టి విధులకు దూరం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం ఐటీడీఏ ఎదుట వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీహెచ్‌డబ్ల్యూవోలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను బాలరాజు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆశా కార్యకర్తలకు చెల్లిస్తున్న తరహాలో సీహెచ్‌డబ్ల్యూవోలకు కూడా నెలకు రూ.10 వేల వేతనం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర నేత కూడ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


