సాక్షి, పాడేరు: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. శనివారం పాడేరులో కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి, వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో సుమారు 600 మంది కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురిచేయడం దారుణమని విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా, కనీస వేతనాలు చెల్లించకుండా వారితో వెట్టిచాకిరీ చేయించడం అన్యాయమన్నారు. కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల పోరాటానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట వేతనాల పెంపు డిమాండ్‌తో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు (సీహెచ్‌డబ్ల్యూలు) చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఎమ్మెల్యే సందర్శించారు. జిల్లాలో పనిచేస్తున్న సుమారు 700 మంది సీహెచ్‌డబ్ల్యూలను ఆశా కార్యకర్తలుగా గుర్తించి, నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.


