తుని: ఓ మహిళ బ్యాగ్‌ను మరిచిపోగా, తిరిగి ఆమెకు తుని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అప్పగించారు. శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి జీఆర్పీ ఎస్‌ఐ వి.సత్తిబాబు తెలిపిన వివరాలు... అనకాపల్లి జిల్లా చిన్న గుమ్ములూరుకు చెందిన ఎర్ర దుర్గా అంబికాదేవి సికింద్రాబాద్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి తుని రైల్వే స్టేషన్‌లో దిగింది. రెండో నంబరు ప్లాట్‌ఫామ్ నుంచి ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్‌కు వచ్చి టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద బ్యాగులు పెట్టింది. సామాన్లు తీసుకువెళ్లే సమయంలో హ్యాండ్ బ్యాగ్‌ను మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బుకింగ్ కౌంటర్ దగ్గర హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ తెరిచి చూడగా, అందులో 52 గ్రాముల బంగారు వస్తువులు, 250 గ్రాముల వెండి వస్తువులు, రూ.3,200 నగదుతో పాటు ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ ఉన్నాయి. ఆధార్‌కార్డులో చిరునామా ప్రకారం పోలీసులు ఫోన్ ద్వారా బాధిత మహిళకు సమాచారం అందించారు. ఆ బ్యాగ్‌ను దుర్గా అంబికాదేవికి అప్పగించడంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.


