పండగ వేళ తిప్పలు | - | Sakshi
Sakshi News home page

పండగ వేళ తిప్పలు

Oct 10 2026 1:10 AM | Updated on Oct 10 2026 1:10 AM

ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ కాంప్లెక్స్‌

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గంటల తరబడి నిరీక్షణ

అరకొర బస్సులతో అవస్థలు

దూరప్రాంతాలకు వెళ్లేందుకు పడిగాపులు

సాక్షి, పాడేరు: పండగలు, వరుస సెలవుల సమయంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా సెలవులు, వారాంతపు సెలవులు కలిసిరావడంతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ శుక్రవారం ప్రయాణికులతో కిక్కిరిసింది. అధిక రద్దీ ఉండే విశాఖపట్నంతో పాటు ఏజెన్సీలోని ముంచంగిపుట్టు, చింతపల్లి రూట్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి కాంప్లెక్స్‌లో నిరీక్షించారు. కాంప్లెక్స్‌లో కూర్చునేందుకు చోటు లేకపోవడంతో మరుగుదొడ్ల సమీపంలోని చెట్ల నీడలో బస్సుల కోసం పడిగాపులు కాశారు.

అన్ని వర్గాల ప్రయాణికులకు ఇబ్బందులే

పండగ సమయాల్లో మైదాన ప్రాంతాల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ సంస్థ గిరిజన ప్రాంతాలను విస్మరిస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి జాతర సమయంలో మత్స్యగుండానికి మినహా ఇతర పండగల వేళ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడం దారుణమని మండిపడుతున్నారు. విద్యార్థులకు దసరా సెలవులు, ఉద్యోగులకు శని, ఆదివారాల్లో సెలవులు రావడంతో మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం నుంచే ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం పాడేరు డిపో నుంచి నడుస్తున్న 40 బస్సులపైనే ప్రయాణికులు ఆధారపడాల్సి వస్తోంది. విశాఖపట్నం డిపో పరిధిలోని సాధారణ సర్వీసులనే నడిపించారని, అదనపు బస్సులు ఏర్పాటు చేయాలన్న ప్రయాణికుల విజ్ఞప్తులను ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఘాట్‌ రూట్లలో నిల్చొనే ప్రయాణం

ఘాట్‌ ప్రాంతాల్లో బస్సుల్లో ప్రయాణికులను నిల్చుని ప్రయాణించేందుకు అనుమతించకుండా, అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. పాడేరు ఘాట్‌తో పాటు చింతపల్లి, రొంపుల మార్గాల్లో బస్సుల్లో నిల్చునే ప్రయాణం చేస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement