మన్యంలో యాలకుల
గిరిజన ప్రాంతాల్లో యాలకుల సాగు సాధ్యమా అన్న సందేహాలకు ముంచంగిపుట్టు
యువ రైతు కిముడు దామోదరం తన ప్రయోగంతో సమాధానం ఇచ్చాడు. కాఫీ, మిరి
యాల తోటల్లో అంతర పంటగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో యాలకులు సాగు చేసి
తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు ఆర్జించాడు. శీతోష్ణ స్థితి, సహజ నీడ, సారవంత
మైన నేలలతో మన్యం ప్రాంతాలు యాలకుల సాగుకు అనుకూలమని ఆయన విజయం
స్పష్టం చేస్తోంది. ఐటీడీఏ నుంచి ప్రోత్సాహం లభిస్తే గిరిజన రైతులకు ఇది లాభదాయక
మైన ప్రత్యామ్నాయ పంటగా మారే అవకాశముంది.
● ముంచంగిపుట్టులో ఫలించిన గిరి రైతు దామోదరం ప్రయోగం
● యూట్యూబ్‌లో చూసి సాగుపై ఆసక్తి
● ప్రకృతి వ్యవసాయంతో విజయవంతమైన యాలకుల సాగు
● ప్రోత్సాహం ఉంటే
విస్తరణకు పెద్ద అవకాశం
ముంచంగిపుట్టు: మన్యంలో యాలకుల సాగు అనుకూలమని ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ చోటముఖిపుట్టు గ్రామానికి చెందిన గిరిజన యువ రైతు కిముడు దామోదరం తన ప్రయోగంతో నిరూపించాడు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని శీతోష్ణ స్థితులు, సహజ నీడ, సారవంతమైన నేలలు యాలకుల పంటకు అనుకూలంగా ఉన్నాయని ఆయన సాగు ద్వారా వెల్లడైంది. యూట్యూబ్ ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలపై అవగాహన పొందిన దామోదరం.. యాలకుల సాగుపై ఆసక్తి పెంచుకున్నాడు.
కేరళ నుంచి ఆన్‌లైన్‌లో మొక్కల దిగుమతి
మొదట ప్రయోగాత్మకంగా కేరళ నుంచి 9 మొక్కలను రూ.2,250కు ఆన్‌లైన్‌లో తెప్పించి, తన ఇంటి వద్ద ఉన్న మిరియాలు, కాఫీ తోటల్లో అంతర పంటగా రెండు సంవత్సరాల క్రితం సాగు ప్రారంభించాడు. రసాయన ఎరువులు పూర్తిగా మానేసి, కేవలం ప్రకృతి వ్యవ సాయ విధానంలో ఆవు పేడ, గొర్రె గత్తం, జీవామృతం, ద్రవ ఎరువులతోనే పంటను సంరక్షించాడు. ప్రత్యేక శ్రద్ధతో సాగు చేయడంతో మొదటి ఏడాదికే మంచి దిగుబడి వచ్చింది. రెండు కిలోల యాలకులు సేకరించి, మార్కెట్‌లో కిలో రూ.5,000 చొప్పున అమ్మి రూ.10,000 ఆదాయం పొందినట్లు రైతు తెలిపాడు. ప్రస్తుతం రెండో దఫా దిగుబడి కూడా సిద్ధంగా ఉందని, ఒక్క మొక్క నుంచి ఏడాదికి కిలో వరకు దిగుబడి వచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. యాలకుల సాగు గిరిజన రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచగలదని దామోదరం అభిప్రాయపడ్డారు.
ఐటీడీఏ ప్రోత్సాహం అవసరం
గిరిజన ప్రాంతాల్లో యాలకుల సాగు విస్తరణకు ప్రభుత్వం, ఐటీడీఏ నుంచి ప్రోత్సాహం అందించాలి. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇచ్చే ఈ పంటను కాఫీ తోటల్లో అంతర పంటగా వేయవచ్చు. ఈ పంట విస్తరణకు ప్రత్యేక రుణాలు, సబ్సిడీలు అందిస్తే గిరిజన రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. – దామోదరం, రైతు


