అరకులోయ టౌన్(డుంబ్రిగుడ): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన నవరత్నాలకు మించి సంక్షేమ పథకాలు అమలు చేశారని అరకులోయ ఎమెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. అనంతగిరి మండల పరిధిలోని గరుగుబిల్లి, గుమ్మకోట, భీమ్‌పోలు పంచాయతీల్లో పార్టీ మండల అధ్యక్షుడు కొర్ర సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన సోమవారం పర్యటించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి నాయకులకు ఐడీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఐడీ కార్డు కలిగిన ప్రతి కార్యకర్తకు సాధారణ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ 5.50 లక్షల ఆర్థిక సహాయం అందుతుందన్నారు. కూటమి సర్కారు వచ్చాక రాష్ట్రంలో సంక్షేమం కరువైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మూడు ఉచిత సిలిండర్లు, ఆడబిడ్డ నిధి రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000, అన్నదాత సుఖీభవ రూ.20వేలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి–విద్యాదీవెన, తల్లికి వందనం హామీలను తుంగలోకి తొక్కారని విమర్శించారు. ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
● భీంపోల్ బాలిక ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి, మెనూ చార్టును పరిశీలించారు. రోజువారీగా అందిస్తున్న ఆహారం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పెడుతున్నారా? లేదా? అని ఆరా తీశారు. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. తరగతి గదులు, వంటశాల, బియ్యం, సరకుల నిల్వలను పరిశీలించారు.


