పాడేరు: స్థానిక ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో పని చేస్తున్న కాఫీ లైజన్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 23 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సోమవారం పాడేరు కేంద్రంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీను, కార్యదర్శి పి.జగన్నాథం మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 2000 సంవత్సరం నుంచి సుమారు 156 మంది కాఫీ లైజన్ వర్కర్లుగా సేవలందిస్తున్నామని తెలిపారు. ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు అమలులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రస్తుతం నెలకు రూ.15 వేల వేతనం మాత్రమే అందుతుందని వాపోయారు. పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సమాన పనికి సమాన వేతనంగా నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లైజన్ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, విధి నిర్వహణలో ప్రమాదాలు సంభవిస్తే బీమా సదుపాయం కల్పించాలని, మరణించిన పక్షంలో కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. ఫీల్డ్ పనుల కోసం నెలకు 10 లీటర్ల పెట్రోల్ భత్యం ఇవ్వాలని, స్టేషనరీ ఖర్చులు, రైతుల డేటా నమోదు కోసం ఒక్కో రైతుకు రూ.15 చెల్లింపును ఐటీడీఏ భరించాలని డిమాండ్ చేశారు. జీవన బీమా, ప్రమాద బీమా సదుపాయాలు కల్పించాలన్నారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు మాట్లాడుతూ లైజన్ వర్కర్ల సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 23 నుంచి చేపట్టే నిరవధిక సమ్మెకు సీఐటీయూ మద్దతు ఉంటుందని తెలిపారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సింహాచలం, నాయకులు పి.బలరాం, బాబూరావు, గుండన్న, అశోక్, గిరి పాల్గొన్నారు.


