భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
చింతపల్లి: చింతపల్లిలో ఐదు నెలల పసిబిడ్డ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కన్నతండ్రే అత్యంత దారుణంగా హతమార్చాడనే ఆరోపణలు స్థానికంగా కలవరపెడుతున్నాయి. వివరాలు ఇలా.. మండల కేంద్రం చింతపల్లిలోని సాయినగర్‌లో ఉండే దంపతులు గొల్లూరి చందు, మణికుమారి కూలి పనులకు వెళుతుంటారు. ఆరేళ్ల వయసున్న రామకృష్ణ, మూడేళ్ల శరణ్యతోపాటు ఐదు నెలలు బాలుడు వీరి సంతానం. మద్యానికి బానిసైన చందు పనులు మానేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. భార్య మణికుమారి ఇంటికి సమీపంలోని ఓ హోటల్లో పనిచేస్తోంది. నిత్యం తన తాగుడుకు డబ్బులు ఇవ్వాలని భార్యను చందు హింస పెడుతుండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం రూ.100 ఇవ్వాలని వేధించగా, పని నుంచి వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పిన మణికుమారి హోటల్‌కు వెళ్లిపోయింది. మధ్యాహ్నం సమయంలో ఏడుస్తున్న పసిబిడ్డను తండ్రి, మణికుమారి వద్దకు తీసుకెళ్ళి పాలు పట్టించి తిరిగి తీసుకువచ్చాడు.
అసలేం జరిగింది.?
పాలు పట్టించి ఇంటికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే పసిబిడ్డ కదలడం లేదని, ఆరోగ్యం బాగోలేదని స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు హోటల్ పనిలో ఉన్న తల్లికి సమాచారం చేరవేసినట్టు స్థానికులు తెలిపారు. అప్పటికే బిడ్డ మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో అక్కడకు చేరుకున్న మణికుమారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బిడ్డను పాల కోసం తీసుకువచ్చినప్పటికే తన భర్త మద్యం తాగి ఉన్నాడని, తన భర్తే బిడ్డను హతమార్చి ఉంటాడని ఆమె బోరున విలపించింది. మరో వైపు చందు ఎప్పుడూ మద్యం తాగి భార్య, పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. సోమవారం కూడా వారి మధ్య గొడవ జరిగిందన్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సింహాచలం తెలిపారు.


