పాడేరు: వైద్యారోగ్య శాఖ పరిధిలో జిల్లా ఆస్పత్రులు, సామాజిక ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. డిమాండ్ల సాధన కోసం కొద్ది రోజులుగా పలు పద్దతుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అధికారులు, పాలకులు స్పందించకపోవడంతో భవిష్యత్ కార్యచరణపై వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పాడేరు గిరిజన భవన్‌లో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం వారంతా పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జేసీ తిరుమణి శ్రీపూజకు వినతిపత్రం అందజేశారు. అలాగే ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఎంహెచ్‌వో రియాజ్‌బైకు కూడా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ గంపరాయి రాంబాబు మాట్లాడుతూ 16 ఏళ్లుగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో స్టాఫ్ నర్సులుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా, ఫార్మసిస్టులుగా, పారా మెడికల్ ఉద్యోగులుగా జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. కానీ సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వడం లేదని, అన్ని అర్హతలు, అనుభవం కలిగిన తాము సుదీర్ఘకాలం పాటు పని చేస్తున్న నేటికీ రెగ్యులైజేషన్‌కు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పూర్తి స్థాయిలో వర్తించే వేతనాలతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలిసి శత శాతం గ్రాస్ జీతాన్ని అందజేయాలన్నారు. తమ సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచరించారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి విధులను బహిష్కరిస్తామన్నారు. మానవతా దృక్పథంతో రోగులకు ఇబ్బంది కలగకుండా అత్యవసర సేవలు, క్యాజువాల్టీ, లేబర్ రూమ్ సేవలు మాత్రమే కొనసాగిస్తామన్నారు. 7న స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ అధికారులు, పారా మెడికల్ సిబ్బంది అందరూ అత్యవసర సేవలతో సహా అన్ని రకాల సేవలను పూర్తిగా బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. తమ కార్యచరణను దృష్టిలో పెట్టుకొని తక్షణమే తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ అనంతరావు, జిల్లా కో ఆర్డినేటర్ ఎలిషా, కో చైర్మన్ మమ్ముట్టి, అధిక సంఖ్యలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.


