అచ్యుతాపురం రూరల్ : వెదురువాడ మరిడిమాంబ కాలనీలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తెన్నేటి మోహన్‌రావు ఆయన భార్య లక్ష్మి నివాసం ఉంటున్న ఇంట్లోకి దొంగలు చొరబడి నాలుగు తులాల బంగారం, రూ.70వేల నగదు అపహరించారు. భార్యాభర్తలు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. వివరాల్లోకి వెల్తే భార్యాభర్తలు సమీపంలోని అల్లుడి ఇంటికి వెళ్లి అక్కడే నిద్రించి, శనివారం ఉదయం ఇంటికి చేరుకునే సరికి చోరీ జరిగిన విషయం గుర్తించారు. మోహన్‌రావు అచ్యుతాపురం అయ్యప్పస్వామి ఆలయంలో అర్చకునిగా సేవలందిస్తున్నారు. సీఐ చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో క్లూస్, క్రైమ్ టీమ్‌లు ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.
మరో మూడిళ్లలో...
యలమంచిలి రూరల్ : పట్టణంలోని ఓరుగంటి వారి వీధి, న్యూ స్టేట్ బ్యాంక్ కాలనీల్లో శనివారం తెల్లవారుజామున పలు ఇళ్లలో చోరీలు జరిగాయని స్థానికులు తెలిపారు. ఓరుగంటి వారి వీధికి చెందిన చెక్క వాసుమాంబ ఇటీవల శ్రీశైలం తీర్థయాత్రకు వెళ్లారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నపుడు ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నట్టు గమనించారు.
ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి అందులో భద్రపరచిన 5 తులాల బంగారు, కిలో వెండి వస్తువులు అపహరణకు గురైనట్టు గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ సావిత్రి తెలిపారు. న్యూ స్టేట్ బ్యాంక్ కాలనీలో మళ్ల కన్నారావు, పద్మావతి ఇళ్లలో కూడా చోరీలు జరిగాయి. పట్టణ ఎస్‌ఐ సావిత్రి, జిల్లాకు చెందిన క్లూస్ టీం బృందం చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించి, ఆధారాలు సేకరించారు. చోరీలు జరిగిన ఇళ్లన్నీ తాళం వేసి ఉన్నవే. ఆయా ఇళ్లలో వారు ఇతర ప్రాంతాలకు వివిధ పనులపై వెళ్లినట్టు తెలుస్తోంది.


