మూడు చోరీ కేసుల్లో ఇద్దరికి జైలు | - | Sakshi
Sakshi News home page

మూడు చోరీ కేసుల్లో ఇద్దరికి జైలు

Oct 4 2026 11:43 AM | Updated on Oct 4 2026 11:43 AM

కశింకోట : కశింకోట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మూడు దొంగతనం కేసుల్లో నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు వేర్వేరు జైలు శిక్షలు విధిస్తూ అనకాపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ఎ.రమేష్‌ శనివారం తీర్పు చెప్పారు. సీఐ అల్లు స్వామినాయుడు అందజేసిన వివరాలివి. మండలంలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన కొల్లి సత్యవతి ఇంట్లో 2023లో 8 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అదే గ్రామానికి చెందిన గమ్మిని నాగేశ్వరరావు ఇంట్లో కూడా ఈ ఏడాది బంగారు, వెండి ఆభరణాలతోపాటు రూ.లక్ష నగదు చోరీ అయింది. చెరకాం గ్రామానికి చెందిన గుర్రి దేముళ్లు ఇంట్లో గత ఏడాది బంగారు గొలుసు, ఉంగరాలు, చెవి దిద్దులు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు వరుసగా ఎస్‌ఐలు జక్కుల నాగేశ్వరరావు,కె. లక్ష్మణరావు, పి. మనోజ్‌కుమార్‌ వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన పొలమరశెట్టి దుర్గా ప్రసాద్‌, మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన దొడ్డి ఆదిబాబు ఆయా నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు. చోరీ సొత్తు రికవరీ చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. విచారణ అనంతరం తుది తీర్పునకు రావడం, నిందితులు దొంగతనాలు చేసినట్టు రుజువు కావడంతో దుర్గా ప్రసాద్‌కు 15 నెలల కఠిన కారాగార శిక్ష, రూ.1500 జరిమానా, ఆదిబాబుకు 3 నెలల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ 12వ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ తీర్పు చెప్పారు. సీఐ స్వామినాయుడు పర్యవేక్షణలో సమర్ధంగా దర్యాప్తు నిర్వహించి నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆర్‌. వాణిలను పోలీసు సూపరింటెండెంట్‌ తుహిన్‌ సిన్హా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement