ఎస్.రాయవరం: మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎకరాలకు ఎకరాలు ఆక్రమిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. చినఉప్పలం ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఆనుకుని ప్రభుత్వ భూముల్లో దర్జాగా నిర్మాణాలు ప్రారంభించారు. స్థానికులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిమ్మాపురంలో నిర్మాణదారులు ఎప్పటికప్పుడు రోడ్లు, కాలువలు, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. కొరుప్రోలులో సర్వే నంబర్ 252లో ఆక్రమణలు లెక్కకు మించి ఉన్నాయి. ప్రతి రోజూ గ్రామంలో ఏదో ఒక మూలన ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. కొందరు తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టుకుంటే మరికొందరు శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. గుర్రాజుపేట, రేవుపోలవరంలలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తీర ప్రాంత భూములను వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆక్రమించుకుంటున్నారు. ఉప్పరాపల్లి, వాకపాడు, బంగారమ్మపాలెం, ధర్మవరం అగ్రహారం, పెనుగొల్లు, గోకులపాడు, దార్లపూడి, వమ్మవరం గెడ్డపాలెం, పెదగుమ్ములూరు తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నారు. ఆక్రమణలపై స్థానిక రెవెన్యూ అధికారులు సమగ్ర నివేదికలు ఇవ్వకపోవడంతో ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మండలంలో పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో ఎకరాలు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వీఆర్వోలతో చర్చించి ఆక్రమణలపై నివేదికలు తెప్పించి, చర్యలు తీసుకుంటాం. అందిన ఫిర్యాదుల మేరకు ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి, నిర్మాణాలను అడ్డుకున్నాం.
– జె.రమేష్‌బాబు, తహసీల్దార్, ఎస్.రాయవరం


