సీతాఫలం! | - | Sakshi
Sakshi News home page

సీతాఫలం!

Aug 4 2026 1:05 AM | Updated on Aug 4 2026 1:05 AM

సిరులొలికే
జిల్లాలో రూ.2 కోట్లకు పైగా వ్యాపారం ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి 800 ఎకరాల్లో తోటలు జోరుగా అమ్మకాలు

సాక్షి, పాడేరు: ప్రకృతి ప్రసాదించిన కమ్మని రుచుల అమృత ఫలమైన సీతాఫలాల సీజన్‌ జిల్లాలో ప్రారంభమైంది. ఈ పండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. తమ తోటల నుంచి సేకరించి తెస్తున్న పండ్లను గిరిజనులు విక్రయిస్తున్నారు.

ప్రత్యేక సంత

సాధారణంగా సంతల్లో వివిధ రకాల సరుకులు విక్రయిస్తారు. అయితే జిల్లాలోని వంట్లమామిడి గ్రామంలో ఈ సీజన్‌లో ప్రత్యేకంగా సీతాఫలాల సంత నిర్వహిస్తారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన ఘాట్‌రోడ్డులో ఉన్న వంట్లమామిడి సంత.. సీతాఫలాలు విక్రయించే ప్రత్యేక సంతగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సీజన్‌ కావడంతో ప్రతిరోజూ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు సీతాఫలాల అమ్మకాలతో వంట్లమామిడి సంత కళకళలాడుతోంది. ఒకప్పుడు ఆదివారం సంత రోజున మాత్రమే సీతాఫలాలను గిరిజన రైతులు అమ్మేవారు. కాలక్రమేణా ఈ సీజన్‌లో ప్రతిరోజూ విక్రయిస్తున్నారు.

అమ్మకాలు జోరు

వంట్లమామిడి సంతలో సీతాఫలాల అమ్మకాలు జోరందుకున్నాయి. మైదాన ప్రాంత వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మార్కెట్‌కు తరలిస్తున్నారు. 20 రోజుల నుంచి భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా జూలై నుంచి అక్టోబర్‌ వరకు వంట్లమామిడి ప్రాంతంలో సీతాఫలాల విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతాయి. వంట్లమామిడితో పాటు అనంతగిరి మండలం కాశీపట్నం, చింతపల్లి మండలం లంబసింగి, అంజలి శనివారం, హుకుంపేట మండలం బాకూరు, జర్రకొండ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా విక్రయాలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా సీజన్‌లో రూ. 2 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని గిరిజనులు, వ్యాపారులు తెలిపారు.

800 ఎకరాల్లో సాగు

పాడేరు మండలం దేవాపురం, ఐనాడ, సలుగు, వంట్లమామిడి, మోదాపల్లి, మినుములూరు, జి.మాడుగుల మండలంలోని వంతాల పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో సుమారు 800 ఎకరాల్లో సీతాఫలాల తోటలను గిరిజన రైతులు సొంతంగానే సాగు చేస్తున్నారు. వీటిని ప్రతి ఏటా విస్తరిస్తున్నారు. సీతాఫలాలు పక్వానికి రాగానే వాటిని సేకరించి కావిళ్లు, బుట్టలతో కాలినడకన వంట్లమామిడి సంతకు మోసుకువెళ్లి అమ్మకాలు జరుపుతారు.

నాలుగు నెలల పాటు ఆదాయం

ప్రతి ఏడాది గిరిజన రైతులకు ఈ పండ్లు సిరులు కురిపిస్తున్నాయి. కొండపోడు, మెట్ట భూముల్లో సాగవుతున్న సీతాఫలాలు రుచిలో నంబర్‌–1గా నిలుస్తున్నాయి. ఎకరం పంటకు రూ. 30 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ సీజన్‌ నాలుగు నెలల పాటు గిరిజనులకు నిత్యం ఆదాయం లభిస్తుంది. కొన్ని గ్రామాల్లో గిరిజన రైతులకు ఐదు ఎకరాలకు పైగానే తోటలు ఉండడంతో ఏడాదికి రూ. లక్షకు పైగా ఆదాయం వస్తోంది.

మైదాన ప్రాంతాలకు

తరలించేందుకు సిద్ధంగా

సీతాఫలాలు

బుట్ట ధర రూ.600

వంట్లమామిడి సంతలో సీతాఫలాలను గిరిజన రైతులు బుట్టలు, కావిళ్లతో అమ్మకాలు జరుపుతున్నారు. ఒక బుట్టను రూ.600, కావిడి (రెండు బుట్టలు) రూ.1000 నుంచి రూ.1200 ధరకు అమ్మతున్నారు. సీతాఫలాల సైజు తగ్గితే మాత్రం ధర కాస్త తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. సీతాఫలాలను వ్యాపారులతో పాటు ఆ దారి వెంబడి వెళ్లే ప్రయాణికులు, పర్యాటకులు కూడా కొనుగోలు చేస్తున్నారు.

వంట్లమామిడి

సంతలో సీతాఫలాలను అమ్ముతున్న గిరిజనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement