● ఘనంగా గుప్తేశ్వరం శివుని మాలధారణ
● కాలినడకన శివాలయాల సందర్శన
సీలేరు: ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పచ్చని కొండలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. గుప్తేశ్వర స్వామి భక్తులు అడవి మార్గంలో కాలినడకన వెళ్లి కనిపించిన ప్రతి శివాలయాన్ని సందర్శించి, అభిషేకాలు చేస్తూ బోల్ బామ్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం గుప్తేశ్వరం... ఇక్కడ ఓ గుహలో శివలింగం ఉంది. పలు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ భక్తులు గుప్తేశ్వర స్వామివారి మాల ధరించి ఈ ప్రాంతాల్లో ఉన్న శివాలయాలకు కాలినడకన కావడితో నీటిని తీసుకెళ్లి, శివలింగాలకు అభిషేకం చేయడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. బోల్ బామ్ అనే నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఈ యాత్రను సాగిస్తారు. ఈ యాత్రలో భాగంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు చిత్రకొండ బ్లాక్ పరిధిలోని 11 వ నంబర్ గ్రామానికి చెందిన శివ భక్తులు కాలినడకన సీలేరు సరిహద్దు గుంటవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలల్లో ఒడిశాలో శ్రావణ మాసం సందర్భంగా ఆ రాష్ట్ర భక్తులు శివ మాలలు ధరిస్తారు. దీన్ని కావడి యాత్ర అని కూడా పిలుస్తారు. నెల రోజుల పాటు కొనసాగించే దీక్షలో ప్రతి సోమవారం ఆయా గ్రామాలకు సమీపంలో ఉండే శివాలయాలకు నదిలో లభ్యమయ్యే నీటిని కావిళ్లతో వెళ్లి అభిషేకాలు చేస్తారు. చివరిగా ఓ సోమవారం ఒడిశాలో ప్రసిద్ధి చెందిన గుప్తేశ్వర్ శివాలయానికి వెళ్లి దీక్షను విరమిస్తారు.


