గిరిజన చట్టాల జోలికి వస్తే ఖబడ్దార్‌ | - | Sakshi
Sakshi News home page

గిరిజన చట్టాల జోలికి వస్తే ఖబడ్దార్‌

Aug 4 2026 1:05 AM | Updated on Aug 4 2026 1:05 AM

ముంచంగిపుట్టు: గిరిజనుల హక్కులు, చట్టాల జోలికి వస్తే సహించేది లేదని గిరిజనులు హెచ్చరించారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రం ముంచంగిపుట్టులో సోమవారం కదం తొక్కారు. ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 23 పంచాయతీల నుంచి భారీగా తరలివచ్చిన గిరిజనులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక జెడ్పీ అతిథిగృహం నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా అంబేడ్కర్‌ పార్కుకు చేరుకున్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి జై ఆదివాసీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు.

నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి. బాలదేవ్‌, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి. బాబూరావు, ఎంపీపీ అరిసెల సీతమ్మ మాట్లాడుతూ గిరిజన చట్టాలు, హక్కులను కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. జీవో నంబర్‌ 3ను పునరుద్ధరిస్తామని ఎన్నికల ముందు అరకు సభలో చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించడం దారుణమన్నారు. గిరిజన యువతీయువకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని, జీవో నంబర్‌ 3ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 1/70 చట్టానికి తూట్లు పొడిచే విధంగా గిరిజనేతరులు కోర్టులను ఆశ్రయించడంతో పూర్తిగా రద్దు చేయాలని స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయడం అన్యాయమన్నారు. 1/70 చట్టం జోలికి వస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించే రాష్ట్రవ్యాప్త మన్యం బంద్‌లో అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

నిరసన ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జి. మాడుగుల సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ నాని, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, స్పెషల్‌ పార్టీ పోలీసులతో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం. ఎం. శ్రీను, నర్సయ్య, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, మేసీ్త్రల సంఘం మండల అధ్యక్షుడు రవి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు, విద్యార్థులు, యువతీయువకులు పాల్గొన్నారు.

జీవో నంబర్‌ 3 పునరుద్ధరణ,1/70 చట్టం పరిరక్షణకు భారీ ర్యాలీ

వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు

8న మన్యం బంద్‌ విజయవంతం

చేయాలి : గిరిజన సంఘం నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement