అరకులోయటౌన్: జగనన్న ప్రభుత్వహయాంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసినట్టు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, నివారణ అవగాహన సదస్సును ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ వైఎస్సార్‌సీసీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ ఫ్యామిలీడాక్టర్, విలేజ్ క్లినిక్‌ల ద్వారా ఉచిత పరీక్షలు, మందులు అందించారని తెలిపారు. 15 ఏళ్లు పైబడిన వారందరి హెల్త్ రిపోర్టును ఆన్‌లైన్ యాప్‌లో పొందుపరిచి, బీపీ, మధుమేహం, కిడ్నీ, గుండె జబ్బులు వంటి అసంక్రమిత వ్యాధులను ప్రాథమిక దశలో నివారించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. అనంతరం హైపర్ టెన్షన్ డేని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీపీ పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాల మేరకు మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య,ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రామ్మూర్తి, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్‌చార్జ్ పాంగి విజయ్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, సుంకరమెట్ట పంచాయతీ అధ్యక్షుడు కొర్రా అర్జున్‌రావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శోభారాణి, వైద్యులు రాము, బాలాజీ, పావని, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


