వానొస్తే..
సొంతింటి కల నెరవేరుస్తాం.. ప్రతి పేదవాడిని ఇంటి యజమానిని చేస్తామని.. ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో గుప్పించిన హామీలివి. కానీ, అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా ఆ నినాదాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. మన్యం జిల్లాలో వేల సంఖ్యలో గిరిజన కుటుంబాలు పక్కా ఇళ్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. అధికారులు సర్వేలు చేసి చేతులు దులుపుకున్నా, పాలకుల నుంచి మాత్రం అనుమతుల ఊసే లేదు. వానొస్తే వణికిపోయే మట్టి గోడలు, గాలి వీస్తే ఎగిరిపోయే రేకుల షెడ్ల మధ్య.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న గిరిజనుల దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్నారు.
సాక్షి, పాడేరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, గిరిజన ప్రాంతాల్లో పేదలకు కొత్త ఇళ్ల మంజూరు అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. పక్కా ఇళ్లు లేక, శిథిలావస్థకు చేరిన మట్టి గోడల మధ్య గిరిజనులు దుర్భర జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో గిరిజన కుటుంబాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి.
హామీలు ఘనం.. అమలు శూన్యం
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి 2 నుంచి 3 సెంట్ల స్థలంతో పాటు, నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ప్రాంతాల్లో అర్హులైన ఒక్క లబ్ధిదారునికి కూడా ఇల్లు మంజూరు చేయలేదు. కనీసం ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ కూడా అడుగు ముందుకు పడలేదు.గ్రామాల్లో ఇళ్లు లేని కుటుంబాలను గుర్తించేందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 2.0 సర్వే పూర్తి చేసి ఏడాది గడిచినా, లబ్ధిదారుల నిరీక్షణ మాత్రం తప్పడం లేదు.
అర్హులను గుర్తించినా..
పీఎంఏవై పథకం కింద ఇళ్లు మంజూరు చేయడమే లక్ష్యంగా, జిల్లాలోని 11 మండలాల్లో (పీవీటీజీ గిరిజనులు మినహా) ఇతర తెగలకు చెందిన 59,409 పేద గిరిజన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. జి.మాడుగులలో 7,640, ముంచంగిపుట్టులో 6,130, పెదబయలులో 6,013, అరకులోయలో 5,707, అనంతగిరిలో 5,609, డుంబ్రిగుడలో 5,348, గూడెంకొత్తవీధిలో 5,164, పాడేరులో 5,147, హుకుంపేటలో 4,907, చింతపల్లిలో 4,484, కొయ్యూరులో 3,259 చొప్పున మొత్తం 59,409 మంది అర్హులుగా తేలింది. వీరికి ఇంతవరకు ఇళ్ల నిర్మాణ అనుమతులు లభించలేదు.
బిక్కుబిక్కుమంటూ..
జిల్లావ్యాప్తంగా వందలాది గిరిజన గ్రామాలు నేటికీ మట్టి గోడలు, పూరి గుడిసెలతోనే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని ఆ శిథిల గృహాల్లోనే గిరిజనులు తలదాచుకుంటున్నారు. ముఖ్యంగా గాలివాన సమయాల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చట్రాపల్లికి అన్యాయం
2024 సెప్టెంబర్ 8న సంభవించిన తుపాను బీభత్సానికి గూడెంకొత్తవీధి మండలం చట్రాపల్లిలో ఇళ్లు కోల్పోయిన గిరిజనులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. బాధితుల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన మోడల్ కాలనీ నిర్మిస్తామని అప్పట్లో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకటించారు. కానీ నేటికీ ఆ ఊసే లేదు. ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన ఆరు గిరిజన కుటుంబాలు గత్యంతరం లేక, తమకు తామే మళ్లీ మట్టి గోడలతో రేకుల షెడ్లను నిర్మించుకుని బతుకు వెళ్లదీస్తున్నాయి. తుపాను బాధితుల పట్ల కూడా ప్రభుత్వం ఇంతటి నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు.ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, సర్వేలో గుర్తించిన అర్హులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి, నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సొంతంగా నిర్మించుకున్నాం
గతంలో వచ్చిన తుపానులో మా ఇళ్లు కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలాం. అప్పట్లో అధికారులు, మంత్రులు వచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలతో ‘మోడల్ కాలనీ’ నిర్మిస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. ప్రభుత్వం నుంచి సాయం అందకపోయేసరికి, అష్టకష్టాలు పడి మళ్లీ మట్టిగోడలతో రేకుల గుడిసెలను మేమే నిర్మించుకున్నాం. పక్కా ఇళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి.
– జి. బలరామమూర్తి, చట్రాపల్లి,
గూడెంకొత్తవీధి మండలం
కూలే దశలో మట్టిగోడల ఇళ్లు
పక్కా ఇళ్లు మంజూరు చేయాలని అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోతోంది. ప్రస్తుతం మేము ఉంటున్న మట్టిగోడల రేకుల గుడిసెలు ఏ క్షణాన కూలుతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. వర్షాలు పడినా, గాలులు వీచినా ఇళ్లు కూలిపోతాయనే భయంతో రాత్రుళ్లు నిద్రపోవడమే మానేశాం. సర్వే చేసి ఏడాది దాటినా ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయకపోవడం మాకు జరుగుతున్న పెద్ద అన్యాయం.
– చింత గంగమ్మ, బల్లగరువు, పినకోట పంచాయతీ, అనంతగిరి మండలం
శిథిల గుడిసెల్లో దుర్భర జీవనం
ఇళ్ల కేటాయింపు సర్వేలకు పరిమితం
59,409 మంది అర్హులను
గుర్తించినా చర్యలు శూన్యం
కూటమి పాలనలో గూడులేక అగచాట్లు


