సాక్షి, పాడేరు: జిల్లా ప్రజలకు సుస్థిర పాలన, సత్వర సేవలు అందించడమే లక్ష్యమని, నిర్దేఽశించిన సమయానికి కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ టి.నిశాంతి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని అన్ని విభాగాలను సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ,సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. అధికారులు,సిబ్బంది సమయపాలన పాటించాలని ఏఒక్క ఫైలు అనవసరంగా పెండింగ్‌లో ఉండకూడదన్నారు. పీజీఆర్‌ఎస్‌తో పాటు ప్రజల సమస్యలన్నింటికీ అధిక ప్రాధాన్యత ఇచ్చి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యాలయంలోని రికార్డులను భద్రపరుచుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ మురళీ,డ్వామా పీడీ వి ద్యాసాగర్,ఇన్‌చార్జి డీఆర్‌వో నీలకంఠరావు,సీపీవో ప్రసాద్,కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రసాదరావు, సూపరిండెంట్ లక్ష్మణరావు,తహసీల్దార్‌లు వంజంగి త్రినాథనాయుడు, రంగారావు పాల్గొన్నారు.
అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరుచుకోవాలి
గిరిజన విద్యార్థులంతా ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ టి.నిశాంతి సూచించారు. మండలంలోని గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల,కుమ్మరిపుట్టు మోడల్ ప్రైమరీ బాలికల పాఠశాలను సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో పలు పాఠ్యాంశాలను చదివించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులంతా చదువుల్లో రాణించాలన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపైన ఉపాధ్యాయులు ఽప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో శ్రీపూజ,డీఈవో రామకృష్ణారావు,గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ పాల్గొన్నారు.
సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
జిల్లా అధికారుల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి అలసత్వం లేకుండా సమన్వయంతో అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు.పీజీఆర్‌ఎస్‌కు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.


