వేసవి ఆరంభంలోనే ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి జలగండం పొంచి ఉంది. అటు వర్షాభావం, ఇటు ఎండల తీవ్రతతో ప్రాజెక్టుకు ప్రధాన నీటి వనరులైన జోలాపుట్టు, డుడుమ జలాశయాలు క్రమంగా అడుగంటుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో రానున్న రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉత్పత్తికి ఇబ్బంది లేదని ప్రాజెక్ట్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, మే నెల నాటి పరిస్థితిపై మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది.
మాచ్‌ఖండ్‌కు
జలాశయాలు
ఎదురుచూపు
ముంచంగిపుట్టు : ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి గండం పొంచి ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆధారమైన జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు ఏప్రిల్ నెలలోనే వేగంగా పడిపోతున్నాయి. జలాశయాల్లో నీరు అడుగంటుతుండటంతో రానున్న రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
గత ఏడాదితో పోలిస్తే దారుణం
జోలాపుట్టు ప్రధాన జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా, శనివారం నాటికి అది 2,724 అడుగులకు పడిపోయింది. గత ఏడాది ఇదే రోజున 2735 అడుగుల నీరు ఉండేది. అంటే గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 11 అడుగుల నీటి నిల్వ తక్కువగా ఉంది. అటు స్పిల్‌వే జలాశయం ఇప్పటికే వెలవెలబోతోంది.
● డుడుమ జలాశయం పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. దీని పూర్తి స్థాయి మట్టం 2590 అడుగులు కాగా, ప్రస్తుతం 2582 అడుగులే ఉంది. డుడుమలో నీటి నిల్వను కాపాడేందుకు జోలాపుట్టు నుంచి రెండు గేట్ల ద్వారా రోజుకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రానున్న రెండు మూడు వారాల్లో భారీ వర్షాలు కురవకపోతే, మిగిలి ఉన్న నీరు కూడా అయిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
అడుగంటిన మత్స్యగెడ్డ
జోలాపుట్టు, డుడుమ జలాశయాలకు ప్రధాన నీటి వనరు మత్స్యగెడ్డ. ఈ ఏడాది మత్స్యగెడ్డ ఏప్రిల్ నెలలోనే ఎండిపోవడంతో జలాశయాల్లోకి ఇన్ ఫ్లో నిలిచిపోయింది. గిరిజన ప్రాంతంలోని ఎనిమిది మండలాల వర్షపాతంపైనే మత్స్యగెడ్డ ఆధారపడి ఉంటుంది. జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడమే ఈ దుస్థితికి కారణం. ఆయా మండలాల్లో భారీ వర్షాలు కురిసి, వరద నీరు మత్స్యగెడ్డకు చేరితేనే జోలాపుట్టు జలాశయం నిండుతుంది.
ఉత్పత్తిపై ప్రభావం
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం 6 జనరేటర్ల సహాయంతో 120 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే జలాశయాల్లో నీటి స్థాయి క్రమంగా తగ్గుతుండటంతో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా వర్షాలు తక్కువగా ఉండటంతో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాశం వైపు చూస్తూ, భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని ప్రాజెక్టు అధికారులు ఎదురుచూస్తున్నారు.
నీటి నిల్వ తక్కువగా ఉన్న జోలాపుట్టు జలాశయం
ఉత్పత్తికి ఆటంకం
లేకుండా చర్యలు
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. జోలాపుట్టు జలాశయంలో నీటి నిల్వలు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ నెలకు సరిపడా నీరు అందుబాటులో ఉంది. అందువల్ల ఈ నెలలో ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే, మే నెల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రస్తుతానికి చెప్పలేం. డుడుమ జలాశయంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మేర పూర్తిస్థాయి నీటి నిల్వలను కొనసాగిస్తున్నాం.
– బి. గోవిందరాజులు,
ఇన్‌చార్జి ఎస్‌ఈ,
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం


