ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో పాత తరం నాటి ఆచార వ్యవహారాలు, అపురూప సంస్కృతికి అద్దం పడుతూ ఇటుకల పండుగ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తరతరాలుగా తమ పూర్వీకులు పాటించిన పద్ధతులను ఏమాత్రం విస్మరించకుండా, గిరిజనులు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
● గ్రామ చావిడి వద్ద కొలువైన శంకుదేవుడికి గిరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గధ రూపంలో ఉండే దేవుడికి గొడుగులు, జెండాలతో అలంకారం చేసి, పూలమాలలు వేసి గ్రామ వీధుల్లో వైభవంగా ఊరేగిస్తున్నారు.
● ఈ పండుగలో అత్యంత కీలకమైన ఘట్టం ’వేట’. వేటలో భాగంగా తమ ఇళ్లలో భద్రపరుచుకున్న ఈటెలు, బల్లెంలు, విల్లు–బాణాలను శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా కోడిగుడ్డును పగలగొట్టి, గ్రామ పురుషులంతా సమిష్టిగా అడవికి వేట కోసం బయలుదేరుతారు.
వారం రోజులు సందడి
వారం రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో గిరిజన గ్రామాలు పండుగ జోష్‌లో మునిగితేలుతున్నాయి. రాత్రి వేళల్లో యువతీ యువకులు, పెద్దలు అంతా కలిసి థింసా నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లోకి వచ్చే వారి నుంచి మహిళలు ‘తాచేరు’ వసూలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. గిరిజన ఆచారాల ప్రకారం జరుగుతున్న ఈ వేడుకలతో మన్యం ప్రాంతమంతా కొత్త వెలుగును సంతరించుకుంది.
బోడిపుట్టులో ఈటెలు, బల్లెంలు, బాణాలకు పూజలు చేస్తున్న గిరిజనులు
బరడలో వేటకు సిద్ధం అవుతున్న గిరిజనులు
గిరిజన గ్రామాల్లో వెల్లివిరిసిన సంప్రదాయం


