అనకాపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీకి ) ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు అత్యవసర ఆపరేషన్లు నిలిపివేయడం వల్ల పేద రోగులు మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని సీపీఐ జిల్లా సీనియర్ నాయకుడు వై.ఎన్.భద్రం అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంకు విద్య, వైద్యం పట్ల చిత్తశుద్ధి లేదని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మూడుసార్లు ఆరోగ్యశ్రీని సేవలు నిలిపివేయడం, రోగులు చనిపోవడం జరుగుతూనే ఉందని ఓట్లు దండుకునే పథకాలకు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం పేద రోగుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పగడ్బందీగా అమలు చేసి చికిత్స అనంతరం భృతిని అందజేసేదని కానీ దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల పేద వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు తెలుస్తుందని, అదే జరిగితే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఇంటికి పంపిస్తారన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరించి పేద రోగులకు సేవలు అందించాలని లేకుంటే వారి ఆగ్రహాన్నికి గురికాక తప్పదన్నారు. ఆరోగ్యశ్రీని పునరుద్ధరించకుంటే ప్రజల తరఫున సీపీఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ అనకాపల్లి జోనల్ కార్యదర్శి తాకాసి వెంకటేశ్వరరావు, సభ్యులు శ్రీరామదాసు అబ్బులు, కోరుబిల్లి శంకరరావు పాల్గొన్నారు.
అవి ప్రభుత్వ హత్యలేనని సీపీఐ ధ్వజం


