నిశీధి వేళ..నిర్భయంగా..
గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు
ట్రాక్టర్లలో సరిహద్దు ప్రాంతానికి
తరలింపు
లోడు రూ.4వేలకు అమ్మకం
చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం
గోదావరి నదిలోకి ఎటపాక సమీపంలో ఏర్పాటుచేసిన రహదారి
గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరిపిన ప్రాంతం
ఎటపాక: గోదావరి నదిలో అర్ధరాత్రి వేళ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎటపాక ప్రాంతం నుంచి భారీగా తరలిపోతున్నా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు కానరావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసుశాఖలు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని ఎటపాక, చింతలగూడెం, గుండాల, గోగుబాక గ్రామాల సమీపంలోని గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు అక్రమార్కులు మార్గాలు ఏర్పాటుచేశారు. చీకటిపడిన వెంటనే తవ్వకాలు మొదలు పెడుతున్నారు. ఈ తతంగం తెల్లవార్లు జరుగుతోంది. గోదావరిలో నీరు తగ్గడంతో ఇసుక తవ్వకాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని తెలంగాణకు చెందిన భద్రాచలం పట్టణంలో ఇసుక కొరత అక్రమార్కులు కాసులు కురిపిస్తోంది. గోదావరి నుంచి తీసుకువెళ్తున్న ఇసుకను సరిహద్దులో నిల్వచేస్తున్నారు. అక్కడి నుంచి భద్రాచలం తరలిస్తున్నారు. లోడు రూ.4 వేలకు అమ్ముతున్నారు.
చింతలగూడెం, కన్నాయిగూడెం, ఎటపాక, రాజుపేట, పురుషోత్తపట్నం, గుండాల, గోగుబాక గ్రామాల్లోని కొన్ని ట్రాక్టర్లను ఇందుకు వినియోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై తహసీల్దార్ శ్రీనివాసరావును వివరణ కోరగా గోదావరి నది ఇసుక తరలిస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. చలి కారణంగా రాత్రివేళల్లో అక్కడికి వెళ్లలేకపోతున్నారన్నారు. తవ్వకాలపై పరిశీలించిన తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు.
నిశీధి వేళ..నిర్భయంగా..


