సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి తగ్గింపు
సీలేరు: విద్యుత్ వినియోగం తక్కువగా ఉండడంతో గ్రిడ్ అధికారుల ఆదేశాల మేరకు స్థానిక జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినట్టు జలవిద్యుత్ కేంద్రం జెన్‌కో ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. సాధారణంగా రోజూ 3 నుంచి 6 మిలి యన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. శీతాకాలం కావడంతో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో రోజుకు ఒక మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్టు ఈఈ తెలిపారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాల్లో రెండు నెలల పాటు విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేసిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో సీలేరు నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేయడానికి జలవిద్యుత్ కేంద్రంలోని 60 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్ల అందుబాటులోనే ఉన్నాయని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు కూడా ఈ ఏడాది పుష్కలంగా ఉందని ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేంద్రప్రసాద్


