సక్రమంగా జీతాలందక అవస్థలు పడుతున్న టీచర్లు
చింతపల్లి: సకాలంలో ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యు.వి.గిరి తెలిపారు. స్థానిక విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. రెండు నెలల నుంచి ఆశ్రమ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు జమ కావడం లేదని చెప్పారు. దీంతో సకాలంలో బకాయిలు చెల్లించ లేక, వడ్డీలు కట్టలేక పలువురు అవస్థలకు గురవుతున్నారని తెలిపారు. బ్యాంకులకు బకాయిలు చెల్లించలేకపోవడంతో సిబిల్ స్కోర్ తగ్గిపోయి మళ్లీ రుణాలుపొందే అవకాశం కోల్పోతున్నారని చెప్పారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు కె.దేముళ్లు, ఏపీజీపీఈఏ అసోసియేట్ ప్రెసిడెంట్ జి.పద్మనాభం,గిరిజన ఉద్యోగులు సంఘం నాయకులు గంగరాజు, మోహనరావు, రామరాజు తదితరులు పాల్గొన్నారు.


