కొండ చీపురు | - | Sakshi
Sakshi News home page

కొండ చీపురు

Dec 8 2025 8:04 AM | Updated on Dec 8 2025 8:04 AM

కొండ

కొండ చీపురు

పాడేరు డివిజన్‌లో వాణిజ్యపరంగా కొండచీపుళ్ల సాగు చేపట్టిన గిరిజన రైతులు గిట్టుబాటు ధరలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో ధర పతనంతో వీరి పరిస్థితి దయనీయంగా మారింది. గత రెండేళ్ల క్రితం కట్ట రూ.60 నుంచి రూ.70కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు ఆసక్తి చూపడం లేదు. దీంతో కట్ట ధర రూ.30కు ఒక్కసారిగా పడిపోవడంతో కూలిడబ్బులు కూడా దక్కడం లేదని గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు.
మార్కెట్లో ధర లేక గిరి రైతుల ఉసూరు

గతంలో కట్ట రూ.60 నుంచి రూ.70

నేడు రూ.30

కనీసం మోత కూలి రాని వైనం

దయనీయంగా పరిస్థితి

సాక్షి,పాడేరు: ఏజెన్సీలో కొండచీపుళ్ల సాగుతో ఒకప్పుడు మంచి ఆదాయం పొందిన గిరిజన రైతులు ఇప్పుడు మార్కెట్‌ పరిస్థితులు కలిసిరాక నష్టాల పాలవుతున్నారు. గిట్టుబాటు ధరల్లేక ఉసూరుమంటున్నారు.

● పూర్వం చీపురు మొక్కలు సేకరించేందుకు గిరిజనులు దట్టమైన అటవీ ప్రాంతాలకు వెళ్లేవారు. కొండచీపుళ్లకు మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో కాలక్రమేణా గిరిజనులే స్వయంగా సాగు చేస్తున్నారు. డుంబ్రిగుడ, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ, హుకుంపేట, జి.మాడుగుల, పాడేరు, అనంతగిరి మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో కొండపోడు, మెట్టభూముల్లో గిరిజనులు పండిస్తున్నారు. అడవులకు వెళ్లడం మానుకున్న గిరిజనులు తమ గ్రామాలకు దగ్గరలోనే సాగు చేపట్టి మంచి ఆదాయం పొందేవారు. ప్రస్తుతం చీపురుపుల్లల సేకరణలో గిరిజనులు నిమగ్నమయ్యారు. బాగా ఎండలో ఆరబెట్టి కట్టలుగా తయారుచేస్తున్నారు. ఎకరా సాగుపై గతంలో కనీసం రూ.5 వేల వరకు ఆదాయం వచ్చేది. ధర పతనం కావడంతో సాగు చేపట్టిన గిరిజన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

● గత రెండేళ్లుగా ధరల్లేక ఆర్థికంగా నష్టపోతున్నామని గిరిజన రైతులు తెలిపారు. ఒకప్పుడు వ్యాపారులు నేరుగా గ్రామాలకు వచ్చి పోటాపోటీగా కొండచీపురు కట్ట రూ.60 నుంచి రూ.70కు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో వారపు సంతలు, మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లకు మోసుకువెళ్లి అమ్మాల్సి వస్తోందని వారు వాపోయారు.

కట్ట ధర రూ.30 లోపే..

కొండచీపుళ్ల ధర రెండేళ్లుగా పతనమైంది. ఇప్పుడు తమ వద్ద కట్ట రూ.30 ధరకు మించి కొనడం లేదని గిరిజన రైతులు తెలిపారు. శనివారం హుకుంపేట వారపుసంతలో కొనుగోలు చేసే వారే కరవయ్యారు. పాడేరు, పెదబయలు, డుంబ్రిగుడ మండలాల నుంచి కొండచీపుళ్లను భారీగా తీసుకువచ్చారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు గిట్టుబాటు ధర కోసం గిరిజన రైతులు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దీంతో తిరిగి గ్రామాలకు మోసుకుని వెళ్లలేక తక్కువ ధరకు అమ్ముకుని వెనుదిరిగారు. వ్యాపారుల సిండికేట్‌ ప్రభావం కూడా మార్కెటింగ్‌పై చూపుతుందని వారు వాపోతున్నారు. విశాఖపట్నం, గాజువాక, విజయనగరం, రాజమండ్రి వంటి ప్రాంతాలకు తరలిస్తున్నా గిట్టుబాటు ధర లభించడం లేదని గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు.

కొనుగోలుకు జీసీసీ దూరం

గిరిజన సహకార సంస్థ గత పదేళ్ల నుంచి కొండచీపుళ్ల కొనుగోలుకు దూరంగా ఉంది.ఈ పంటను సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత జీసీసీపై ఉంది. నష్టం వస్తుందన్న సాకుతో చాన్నాళ్ల నుంచి కొనుగోలు చేయడం లేదు.

రెండేళ్లలో ధరలు తగ్గడం దారుణం

కొండచీపుళ్ల కట్టలకు ఈ రెండేళ్లలో ధరలు భారీగా తగ్గడం దారుణం. తమ వద్దకు వ్యాపారుల వచ్చి కొనుగోలు చేసే వారు. గతంలో చీపురు కట్ట రూ.60కు అమ్మేవాళ్లం. ఈఏడాది ధర దారుణంగా తగ్గించేశారు. కట్ట రూ.25నుంచి రూ.30కు కొంటున్నారు. జీసీసీ, వెలుగు సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కొండచీపుళ్లకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి సారించాలి.

– పొడువ బొంజుబాబు, గిరిజన రైతు,గంగరాజుపుట్టు, హుకుంపేట మండలం

కొండ చీపురు1
1/2

కొండ చీపురు

కొండ చీపురు2
2/2

కొండ చీపురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement