పర్యాటక ప్రాంతాల్లో వీకెండ్ సందడి
● ఆదివారం రికార్డుస్థాయిలో రాక
● వంజంగి హిల్స్ సందర్శన పోటెత్తిన వైనం
● అటవీశాఖకు రూ.1,88,590 ఆదాయం
పాడేరు : జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడాయి. ఆదివారం సెలవు కావడంతో మైదాన ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి సందడి చేశారు. వంజంగి మేఘాల కొండకు పోటెత్తారు. శనివారం రాత్రి పాడేరు పట్టణంతో పాటు వంజంగి కొండ దిగువున రిసార్ట్స్, హోటళ్లు, క్యాంపెయిన్ టెంట్లలో పర్యాటకులు బస చేశారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు వంజంగి కొండపైకి బయలుదేరారు. వేకువజామున మేఘాలను చీల్చుకుంటూ వస్తున్న ఉదయభానుడితోపాటు మంచు అందాలు, పాల సమూద్రాన్ని తలపించేలా ఉన్న మేఘాల దృశ్యాలను చూసి పరవశించిపోయారు. ప్రకృతి అందాలను కనులారా వీక్షించి తనివితీరా ఆస్వాదించారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఆదివారం వంజంగి మేఘాల కొండకు 3500 మంది పర్యాటకులు సందర్శించారని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు ద్వారా రూ.1,88,590 ఆదాయం సమకూరిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది పర్యాటక సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఈ ఆదివారమే రికార్డు స్థాయిలో పర్యాటకులు వచ్చారని అటవీశాఖ అధికారులు, చిరు వ్యాపారులు తెలిపారు.
లంబసింగికి పోటెత్తిన పర్యాటకులు
చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు.ఆదివారం వీకెండ్ కావడంతో మైదాన ప్రాంతాలనుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి లంబసింగి జంక్షన్, చెరువులవేనంలో పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద 11 గంటల వరకు పర్యాటకులు మంచు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను సెల్‌ఫోన్లలో బంధించేందుకు పోటీపడ్డారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు, బోటు షికారుపై ఆసక్తిచూపారు. స్ట్రాబెర్రీ తోటల్లో తాజా పండ్లను కొనుగోలు చేశారు. అలాగే యర్రవరం జలపాతానికి కూడా పర్యాటకులు అధిక సంఖ్యతో తరలి వచ్చారు. సాయంత్రం వరకు లంబసింగి పరిసర ప్రాంతాలు పర్యాటకులతో రద్దీగా కనిపించాయి.
చాపరాయిలో సందడి
డుంబ్రిగుడ: మండలంలలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో సందడి నెలకొంది. దూర ప్రాంత పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గిరిజన వస్త్రధారణలో థింసా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.అరకు పైనరీలో సందడి నెలకొంది.
పర్యాటక ప్రాంతాల్లో వీకెండ్ సందడి
పర్యాటక ప్రాంతాల్లో వీకెండ్ సందడి
పర్యాటక ప్రాంతాల్లో వీకెండ్ సందడి
పర్యాటక ప్రాంతాల్లో వీకెండ్ సందడి


