విశాఖ
11న మిసైల్ టెస్టింగ్‌కు విశాఖ తీరం ఎంపిక చేసిన ప్రభుత్వం 1,190 కిమీ మేర నో ఫ్లై జోన్‌గా గుర్తిస్తూ ఉత్తర్వుల జారీ సముద్రంలో గుర్తించిన ఫ్లైజోన్‌లో విమాన రాకపోకలు బంద్ విశాఖలో ఇప్పటికే త్రినేత్ర పేరుతో క్షిపణుల పరిశీలన కేంద్రం ఏర్పాటు
క్షిపణి ప్రయోగ కేంద్రంగా
సాక్షి, విశాఖపట్నం : భారత నౌకాదళంలో కీలక ప్రాంతంగా వ్యవహరించేలా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోంది. అణ్వాయుధ పరీక్షల్లోనూ తనదైన ముద్ర వేస్తూ విశాఖ తీరంలో.. అత్యంత కీలకమైన ప్రయోగాలకు వేదికగా మారుతోంది. గతేడాది కే4 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన తొలి నగరంగా రక్షణ శిఖరాలెక్కిన విశాఖ.. మరో మిసైల్ టెస్టింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 11న విశాఖ సముద్ర జలాల్లో క్షిపణి ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. 1,190 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్‌గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వార్ బేస్ నుంచి హిందూ మహా సముద్రం కలిసే ప్రాంతం వరకూ డేంజర్ జోన్‌గా ప్రకటించింది. ఇప్పటికే అత్యాధునిక స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ కేంద్రం ‘త్రినేత్ర’ విశాఖలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. వరుస ప్రయోగాలకు కేంద్రంగా విశాఖ మారనుందని అంచనా వేస్తున్నారు.
విశాఖ సముద్రంలో ప్రయోగించనున్న క్షిపణి పరీక్ష కోసం ప్రమాద ప్రాంతాన్ని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటీస్ టు ఎయిర్‌మెన్ (నోటమ్) ప్రకారం, ఈ మిసైల్ టెస్టింగ్ ఈ నెల 11న జరగనుందని స్పష్టమవుతోంది. ఇందుకోసం మొత్తం 1,190 ప్రాంతం వరకూ డేంజర్ జోన్‌గా డిక్లేర్ చేశారు. రెండు వారాల క్రితం విశాఖ తీరంలో డిసెంబర్ 1 నుంచి 4 మధ్యలో మిసైల్ టెస్టింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం అప్పట్లో 3,485 కిమీ ప్రాంతాన్ని డేంజర్ జోన్‌గా డిక్లేర్ చేశారు. దాన్ని రద్దు చేస్తూ తాజాగా కొత్త నో ఫ్లైజోన్‌ని ప్రకటించారు. విమాన కార్యకలాపాలు, సముద్ర భద్రతని ప్రభావితం చేసేందుకు యుద్ధ నౌకలు, జలాంతర్గాము ల్ని అప్రమత్తం చేసేందుకు ఈ డేంజర్ జోన్‌ని ప్రకటించారు. దీని ఆధారంగా పైలట్లు, విమానయాన సంస్థలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నోటమ్ ద్వారా అధికారిక నోటిఫికేషన్‌ని అందజేయనున్నారు. ఈ డేంజర్ జోన్ ప్రకటన ఉన్నంతవరకూ ఆ పరిధిలో పౌర, యుద్ధ విమానాలు ఎగరనీయకుండా దారిమళ్లించనున్నారు. భారత కాలమానం ప్రకారం 11వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో ఈ మిసైల్ టెస్టింగ్ ఉండే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.
త్రినేత్ర రాకతో
మరింత కీలకంగా..
వ్యూహాత్మక నేవల్ బేస్ ఐఎన్‌ఎస్ కళింగ.. అత్యాధునిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా మారింది. నావల్ వెపన్ సిస్టమ్స్‌ను పరీక్షించడానికి సుమారు రూ.5 కోట్లతో అత్యాధునిక నేవల్ ఆర్మెమెంట్ ఇన్‌స్పెక్టొరేట్ కేంద్రం ‘త్రినేత్ర’ని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. నౌకాదళ ఆయుధ సంపత్తి నాణ్యత పరిశీలన, లైఫ్‌టైమ్ చెకింగ్ మొదలైన అంశాల కోసం... ఇప్పటి వరకూ ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎం)లపైనే భారత నౌకాదళం ఆధారపడేది. ఇకపై భీమిలి కేంద్రంగా ఐఎన్‌ఎస్ కళింగలో ఏర్పాటు చేసిన త్రినేత్ర ద్వారా ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించనున్నారు. క్షిపణులు, రాకెట్‌లు, ఆయుధాల సామర్థ్యమెలా ఉంది.? ఇంకా వాటి జీవిత కాలం ఎన్ని రోజులు ఉంటుంది.? మొదలైన పరిశీలనల్ని చేసే అత్యాధునిక సాంకేతికత త్రినేత్రలో ఏర్పాటు చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడి పరికరాల్ని తయారు చేసినట్లు తూర్పు నౌకాదళవర్గాలు చెబుతున్నాయి. స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ సెంటర్‌లో క్షిపణులు, రాకెట్లు, సంబంధిత వ్యవస్థల కీలక పనితీరు వివరాల్ని నమోదు చేయడంతో పాటు.. రికార్డ్ కూడా చేసేలా రూపొందించారు. దీని ద్వారా.. నావల్ ఆర్మమెంట్ సిస్టమ్స్ పనితీరుకు సంబంధించి సమగ్రంగా అంచనా వెయ్యొచ్చు. ఆయుధ పరీక్ష మౌలిక సదుపాయాల కల్పనలో త్రినేత్ర ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది.
విశాఖ తీరానికి కొత్తేంకాదు..!
విశాఖ తీరానికి క్షిపణి ప్రయోగాలు కొత్తేంకాదు. ఇప్పటికే అత్యంత కీలకమైన మిసైల్ టెస్టింగ్ నిర్వహించి.. చరిత్ర సృష్టించింది. గతేడాది నవంబర్‌లో అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ మిసైల్‌ను భారత నౌకాదళం విశాఖ తీరంలో విజయవంతంగా నిర్వహించింది. విశాఖ షిప్‌బిల్డింగ్ సెంటర్‌లో నిర్మించిన న్యూక్లియర్ సబ్‌మైరెన్ ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ మిసైల్‌ని పరీక్షించగా.. 3500 కిలోమీటర్ల రేంజ్‌ను అత్యంత వేగవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ అణునిరోధక శక్తిని పెంచే సామర్థ్యం గణనీయంగా పెరిగి.. అగ్రదేశాలకు విశాఖ నుంచి సవాల్ విసిరింది. ఈ ప్రయోగంతో ఆసియా దేశాల్లో చైనాతో పోటీగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకూ సబ్‌మైరెన్ల నుంచి మిసైల్ దాడి చేయగల సామర్థ్యం ఆసియా దేశాల్లో కేవలం చైనాకు మాత్రమే ఉండేది. కే–4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం తర్వాత సబ్‌మైరెన్ నుంచి అణుదాడి చేయగల సామర్థ్యం కలిగి ఉన్న ఆసియా దేశాల్లో రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భవిష్యత్తులో మరో అణు జలాంతర్గామి భారత్ అమ్ముల పొదిలోకి రానుంది. ఇది వస్తే.. 5000 కిమీ రేంజ్ ఉన్న కే5 మిసైల్స్‌ని కూడా ప్రయోగించే సామర్థ్యం భారత్ సొంతం కానుంది. ఇప్పుడు ఏ క్షిపణి ప్రయోగం చేస్తారన్న అంశాన్ని రక్షణ వర్గాలు గోప్యంగా ఉంచాయి.
విశాఖ


