జాతీయ గౌరవ దివాస్‌విజయవంతం చేయాలి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పీవీఎన్ మాధవ్ పిలుపు
పాడేరు : గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండా జయంతి (జన జాతీయ గౌరవ దివాస్)ను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ఓ ఎన్జీవో హోంలో జన జాతీయ గౌరవ దివాస్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గిరిజన పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతమాత, బిర్సాముండా చిత్రపటాలకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పాడేరు, అరకు, రంపచోడవరం, పార్వతీపురం ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన ఉప కులాల పెద్దలనుంచి బిర్సాముండా జయంతి నిర్వహణపై అభిప్రాయాలు సేకరించారు. ఈనెల 15న పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వద్ద బిర్సాముండా జయంతి ఘనంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి గిరిజన ఉప కులల పెద్దలు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, గిరిజన సంఘాల నేతలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. భగవాన్ బిర్సాముండా కాంస్య విగ్రహం ప్రతిష్టిస్తామని ఆయన తెలిపారు.


