పొల్లూరు పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

పొల్లూరు పరవళ్లు

Nov 9 2025 7:21 AM | Updated on Nov 9 2025 7:21 AM

పొల్ల

పొల్లూరు పరవళ్లు

● జలపాతం వద్ద మౌలిక వసతుల కల్పనపై అటవీశాఖ దృష్టి ● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే బీజం ● జలవిద్యుత్‌ కేంద్రం నుంచి రూ.50 లక్షల సీఎస్సార్‌ నిధులు కేటాయించిన ఏపీ జెన్‌కో ● అంచెలంచెలుగా అందుబాటులోకి వస్తున్న సౌకర్యాలు

ప్రకృతి అందాలకు నెలవైన పొల్లూరు జలపాతం అభివృద్ధిపై అటవీశాఖ దృష్టి సారించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నఅటవీశాఖ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. అప్పటి ప్రభుత్వ ఆధ్వర్యంలోఏపీ జెన్‌కో కేటాయించిన రూ.50 లక్షల సీఎస్సార్‌ నిధులతో పనులు చేపట్టింది.
ఆహ్లాదం పంచేలా..
పిక్నిక్‌ స్పాట్‌

మోతుగూడెం: పొల్లూరు జలపాతానికి మంచి రోజులు వచ్చాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు బీజం పడటంతో పర్యాటకులకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ జలపాతం వర్షాకాలంలో, ముఖ్యంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఉప్పొంగి ప్రవహిస్తూ చూసేందుకు అందంగా కనిపిస్తుంది. కొండల మధ్య సుమారు 50 అడుగుల ఎత్తునుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది.

● పొల్లూరు నుంచి డొంకరాయి వెళ్లే మార్గంలో రోడ్డుకు అరకిలోమీటరు దూరంలో ఉంది. ఫోర్‌బే, డొంకరాయి అటవీప్రాంతంలోని కొండలమధ్య నుంచి జాలువారుతూ పొల్లూరు వద్ద సీలేరు నదిలో కలుస్తుంది.

● పర్యాటకంగా ప్రాచుర్యం పొందిన ఈ జల సోయగం అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగింది. దీనిలో భాగంగానే ఈ ప్రాంతాన్ని అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలోని 5,6 యూనిట్ల నిర్మాణ నేపథ్యంలో వీటికి సంబంధించి సుమారు రూ.కోటి మేర సీఎస్సార్‌ నిధులను ఏపీ జెన్‌కో కేటాయించింది. వీటిలో రూ.50 లక్షలు గత ప్రభుత్వంలో విడుదల అయ్యాయి.

● ఏపీ జెన్‌కో విడుదల చేసిన సీఎస్సార్‌ నిధులతో జలపాతం ప్రవేశద్వారాన్ని పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాటుచేశారు. సుమారు 50 కార్లు పార్కింగ్‌కు అనుకూలంగా స్థలాన్ని చదును చేశారు. పర్యాటకులు సేదతీరేందుకు రెల్లిగడ్డితో పగోడాలు నిర్మించారు. కూర్చునేందుకు వీలుగా సుమారు 8 సిమెంటు బెంచీలు ఏర్పాటుచేశారు. ప్రవేశద్వారం నుంచి జలపాతం వరకు అరకిలోమీటరు పొడవునా గ్రావెల్‌తో మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటుచేశారు.

● జలపాతం వద్ద ప్రమాదకర ప్రాంతంలో పర్యాటకుల రక్షణ నిమిత్తం సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటుచేశారు. ఇక్కడ స్థానిక గిరియువత ఐదుగురితో సొసైటీ ఏర్పాటుచేసి ఉపాధి కల్పించారు. కారు పార్కింగ్‌కు రూ.50, బస్సుకు రూ.100 వసూలు చేస్తున్నారు. జలపాతం సందర్శించే వారికి ఒకొక్కరికి రూ.20 ప్రవేశ రుసుం చెల్లించాలి. వీటికి మరికొంత మొత్తాన్ని జోడించి అటవీశాఖ వీరికి చెల్లిస్తోంది. మంజూరైన సీఎస్సార్‌ నిధులు రూ.50 లక్షల్లో ఇప్పటివరకు సుమారు రూ.20 లక్షలు ఖర్చుచేసినట్టు అటవీశాఖ అధికారవర్గాలు తెలిపాయి.

● జలపాతాన్ని ఇటీవల ప్రిన్సిపల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చిరంజీవి సందర్శించారు. లక్కవరం అటవీరేంజి పరిధిలో సుకుమామిడి గ్రామం నుంచి అటవీప్రాంతం గుండా గుడిసె వరకు సుమారు 12 కిలోమీటర్ల పొడవునా ట్రెక్కింగ్‌ నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై సర్వేకు ఆదేశించారు. మోతుగూడెం అటవీశాఖ కార్యాలయం ఎదురుగా గుట్టపై ఉన్న గెస్ట్‌ హౌస్‌ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

● పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు ప్రధానరోడ్డు నుంచి ప్రవేశద్వారం వరకు సిమెంట్‌ ఫ్లోరింగ్‌ చేపట్టేందుకు రూ.5లక్షలతో అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవికాకుండా పర్యాటకులు దుస్తులు మార్చుకునేందుకు పురుషులు, మహిళలకు ఆరు గదులు పూర్తిస్థాయిలో నిర్మాణానికి చర్యలు చేపట్టారు. తిను బండారాల స్టాళ్లు ఏర్పాటుకు పక్కా భవనం నిర్మించి స్థానిక గిరి యువతకు అప్పగించే ఆలోచనలో అటవీశాఖ ఉంది.

ప్రమాదాల నివారణకు ఏర్పాటుచేసిన గ్రిల్‌

వాహనాల పార్కింగ్‌ కోసం చదును చేసిన ప్రాంతం

పొల్లూరు జలపాత ముఖద్వారం

మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం

గత ప్రభుత్వంలో మంజూరైన రూ.50 లక్షల్లో ఇప్పటివరకు సుమారు రూ.20 లక్షలు మౌలిక వసతుల కల్పనకు కేటాయించాం. మిగిలిన రూ.30 లక్షలతోపాటు మరో రూ.45 లక్షలు విడుదల అయ్యాయి. వీటిని పొల్లూరు జలపాతంతో పాటు పరిసర పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు సౌకర్యవంతంగా మౌలిక వసతులకు కల్పనకు వెచ్చిస్తాం.

– జి.నానాజి, రేంజ్‌ అధికారి, లక్కవరం

అతిథి గృహం నిర్మించనున్న మెట్ట ప్రాంతం

పొల్లూరు పరవళ్లు1
1/4

పొల్లూరు పరవళ్లు

పొల్లూరు పరవళ్లు2
2/4

పొల్లూరు పరవళ్లు

పొల్లూరు పరవళ్లు3
3/4

పొల్లూరు పరవళ్లు

పొల్లూరు పరవళ్లు4
4/4

పొల్లూరు పరవళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement