
ఉపాధ్యాయుల రణభేరిపై పోలీసుల ఆంక్షలు
రాజవొమ్మంగి: నిరసన వారంలో భాగంగా యూటీఎఫ్ మంగళవారం తలపెట్టిన రణభేరి కార్యక్రమం విజయవంతమైంది. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి నేతృత్వంలో ఉపాధ్యాయులు మంగళవారం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నుంచి మోటారు బైకులపై ర్యాలీగా బయలు దేరారు. జెండాలు, నినాదాలతో చేపట్టిన ఈ రణభేరికి ప్రభుత్వ అనుమతులు లేవని స్థానిక సీఐ గౌరీశంకర్, ఎస్‌ఐ శివకుమార్ ఆందోళనకారులను అడ్డగించారు. రహదారికి అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు ముందుకు సాగకుండా నిలువరించారు. దేవీపట్నం వరకు ఊరేగింపుగా వెళ్లాల్సిన ఉపాధ్యాయులను పోలీసులు రాజవొమ్మంగిలోనే అడ్డుకున్నారు.
గంగవరం : ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ చేపట్టిన రణభేరి బైక్ జాత రంపచోడవరం నియోజకవర్గంలో విజయవంతంగా సాగిందని యూటీఎఫ్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ తెలిపారు. మంగళవారం ఉదయం రాజవొమ్మంగి నుంచి ప్రారంభమైన బైక్ జాతకు విశేష స్పందన లభించిందన్నారు. మంగళవారం మధ్యాహ్నానికి గంగవరం చేరుకున్న బైక్ జాతకు గంగవరం మండల యూటీఎఫ్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు ఎన్.అరుణకుమారి, రవి చక్రవర్తి, కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.టి.వి.సుబ్బారావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయకర్, షరీఫ్, కాకినాడ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.నగేష్, సిహెచ్.సూరిబాబు, అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ టి.విజయ్‌కృష్ణ, జిల్లా కోశాధికారి విశ్వరాజ్, జిల్లా కార్యదర్శులు ఆదిరెడ్డి, సూరిబాబు రమేష్ బాబు, ఏజెన్సీ ఏడు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల రణభేరిపై పోలీసుల ఆంక్షలు