● భారీ వర్షాలకు పరవళ్లు ● రా రమ్మంటూ ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం
కొండల మధ్య నుంచి జాలువారుతున్న రంగినిగూడ జలపాతం
పాల నురగలా ఉరకలు వేస్తున్న తారబు జలపాతం
ముంచంగిపుట్టు/రంపచోడవరం/మోతుగూడెం: మన్యం సందర్శనకు వచ్చేవారి దృష్టంతా జలపాతాలపైనే ఉంటుంది. దట్టమైన అడవిలో విహరిస్తూ జలపాతాల సవ్వడిని ఆస్వాదించాలని ఆరాటపడుతుంటారు. ఇలాంటి రమణీయ దృశ్యాలు పేరు చెప్పగానే మొట్టమొదటిటి గుర్తొచ్చేది పాడేరు, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు. ఇక్కడ ప్రవహించే వాగులన్నీ ఏదొక కొండ మీద నుంచి జాలువారుతూ పుట్టినవే.
డుడుమ.. సొగసు చూడతరమా!
ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు డుడుమ జలపాతం ఉరకలేస్తోంది. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల నీటిమట్టాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రమాదస్థాయికి చేరినప్పుడల్లా వరద నీటిని దిగువన ఉన్న బలిమెల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తుంటారు. ఈ నీరంతా సుమారు 558 అడుగుల ఎత్తునుంచి జాలువారుతూ పర్యాటకులను కట్టిపడేస్తోంది. ప్రవాహ ఉధృతికి తేమ, మంచు సోయగాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
● డుడుమ జలపాతం వద్దకు వెళ్లేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం జిల్లా కేంద్రమైన పాడేరు నుంచి ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంది. పాడేరు 76 కిలోమీటర్ల దూరం. డుడుమ నుంచి మరో నాలుగు కిలోమీటర్లు ఒడిశా బస్సులు/ ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాలి. ఈ ప్రాంతంలో జలపాతంతోపాటు వించ్ హౌస్, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, డుడుమ రిజర్వాయరు చూడదగ్గవి.
పాలనురగను తలపిస్తూ..
ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల సరిహద్దులో ఉన్న తారబు జలపాతం పర్యాటకుల మదిని దోచేస్తోంది. ప్రవాహం పాలనురగలు తలపిస్తోంది. ఇక్కడికి వెళ్లేందుకు జిల్లా కేంద్రం పాడేరు నుంచి బూసిపుట్టు వరకు ఉదయం ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పాడేరు నుంచి 82 కిలోమీటర్ల దూరం. బూసిపుట్టు నుంచి ప్రైవేట్ వాహనంలో సుమారు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలి. సందర్శకులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరెన్నో..
రంగబయలు పంచాయతీ రంగినిగూడ, బరడ పంచాయతీ హంసబంద, బూసిపుట్టు పంచాయతీ సంతవీధి, దోనిపుట్టు, బాబుశాల పంచాయతీ జగిగూడ, జర్జుల పంచాయతీ బురదగుంట జలపాతాలు ఉరకలేస్తూ కనువిందు చేస్తున్నాయి. జలపాత సోయగాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఈ ప్రాంతాలకు ముంచంగిపుట్టు నుంచి వెళ్లాలి. బస్సు సౌకర్యం లేనందున ప్రైవేట్ వాహనాలపై వెళ్లాల్సి ఉంటుంది.
బండరాళ్లు, పచ్చదనం మధ్య..
జలతరంగణి జలపాతం ప్రకృతి అందాల మధ్య కనువిందు చేస్తోంది. ప్రముఖ పర్యాట కేంద్రం మారేడుమిల్లి నుంచి భద్రాచలం ఘాట్‌రోడ్డులో సుమారు 10 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. ఇరువైపులా దట్టమైన అడవి, పచ్చదనం మధ్య సుమారు కిలోమీటరు మేర కాలిబాటన వెళ్లాలి. రంపచోడవరం మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్పుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. రాజమహేంద్రవరం, కాకినాడ, రావులపాలెం నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
● దుంపవలస జలపాతం పర్యాటకుల మనసు దోచేస్తోంది. వర్షాకాలంలో మాత్రమే కనువిందు చేస్తుంది. ఇక్కడికి మారేడుమిల్లి నుంచి గుర్తేడు మార్గంలో సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. బస్సు సౌకర్యం లేదు. ఆసక్తి ఉన్న వారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాలి.
దట్టమైన అడవుల్లో గిరుల నడుమ.. వంపులు తిరుగుతూ పరుగులు తీస్తున్నాయి వాగులు. కొండలపై నుంచి పాలనురగలా జాలువారుతూ, పరవళ్లు తొక్కుతూ.. పర్యాటకుల హృదయాలను పరవశింపజేస్తున్నాయి జలపాతాలు. మన్యం అందాలను ఆస్వాదించాలనుకునే ప్రకృతి ప్రేమికులకు ‘రా రమ్మని’ పిలుస్తున్నట్లుగా ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పులకించి, మరింత అందంగా కనువిందు చేస్తున్నాయి.
జలజల జలపాతం నువ్వు..
జలజల జలపాతం నువ్వు..
జలజల జలపాతం నువ్వు..
జలజల జలపాతం నువ్వు..