
కొయ్యూరు ఎంఈవోపై డీఈవో ఆగ్రహం
● సక్రమంగా విధులు
నిర్వహించకపోవడంపై మందలింపు
● వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు?
కొయ్యూరు: విధులు సక్రమంగా నిర్వహించకపోవడంపై మండల విద్యాశాఖాధికారి ఎల్. రాంబాబుపై డీఈవో బ్రహ్మాజీరావు ఆగ్రహానికి గురయ్యారు. పనితీరు మెరుగుపరుచుకోకుంటే చర్యలు తప్పవని ఆయన మందలించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు.అయితే ఈ పాఠశాలకు హెచ్‌ఎంగా వ్యవహరిస్తున్న ఎంఈవో ఆ సమయంలో లేకపోవడంపై అసంతృప్తి చెందారు. భవిత కేంద్రాన్ని నిర్వహించే ఐఆర్‌టీలపై పర్యవేక్షణ చేయకపోవవడంతో ఎంఈవోపై ఆగ్రహం చెందారు. దివ్యాంగ పిల్లలకు ఈ కేంద్రంలో ఇద్దరు ఐఆర్‌టీలు రాజు,గౌరిశంకర్ బోధన చేయాల్సి ఉంది. వీరిద్దిరి హాజరును పరిశీలిస్తే గైర్హాజరు అయినట్టు తేలింది. దీనిపై ఎంఈవో అసలు పర్యవేక్షించడం లేదని ఆగ్రహానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వోన్నత పాఠశాలలో ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇక్కడ అర్హులైన ఉపాధ్యాయులు బోధన చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. వీరికి ప్రోత్సాహకాలు వస్తాయన్నారు. ఐఆర్‌టీల్లో ఒకరైన రాజు మాట్లాడుతూ కిడ్నీ సమస్య కారణంగా రెండు రోజులు సెలవు పెట్టానట్టు తెలిపారు. ఎంఈవోకు డీఈవో షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు తెలిసింది.