
గడువులోగా పీఎం జన్‌మన్ పూర్తి
పాడేరు : పీఎం జన్‌మన్ కింద మంజూరైన అన్ని రకాల పథకాలను గడువులోగా పూర్తి చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో హౌసింగ్, డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్, ఏపీఈపీడీసీఎల్ అధికారులతో శాఖల వారీగా వారంతపు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్ధేశించిన అన్ని పనులను గడువులోగా పూర్తి చేయల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాల్సిందేనని చెప్పారు. క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహించి, ప్రగతిపై తనకు నివేదికలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ బాబు, డ్వామా పీడీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
పాడేరు : టెన్త్ పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. సోమవారం ఆమె మండలంలోని కందమామిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, స్టోర్, సిక్ రూములను పరిశీలించారు. అనంతరం ఆమె విద్యార్థినులతో ముచ్చటించారు. విద్యా బోధన, అందజేస్తున్న ఆహారంపై ఆరా తీశారు. విద్యార్థినుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. పాఠశాల, వసతి గృహం పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.

గడువులోగా పీఎం జన్‌మన్ పూర్తి