
రహదారి పనులు ప్రారంభించాలని ఆందోళన
ముంచంగిపుట్టు: మండలంలోని జోడిగుమ్మ నుంచి గొబ్బరపడ గ్రామానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని వైస్‌ఎంపీపీ సిరగం భాగ్యవతి డిమాండ్ చేశారు. వైస్‌ఎంపీపీ భాగ్యవతి,సర్పంచ్ దనియా,వైఎస్సార్‌సీపీ నేతలు కొండలు,గుట్టలు ఎక్కి వాగులు దాటి కాలినడకన రంగబయలు పంచాయతీ అర్లాయిపుట్టు,గొబ్బరపడ గ్రామాలకు సోమవారం వెళ్లారు.ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు.ఎప్పటి నుంచో వేధిస్తున్న రహదారి సమస్యను నేతల దృష్టికి గిరిజనులు తీసుకువచ్చారు. అనంతరం రహదారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అర్లాయిపుట్టు,గొబ్బరపడ గ్రామాల గిరిజనులు, వైస్‌ఎంపీపీ, సర్పంచు, నేతలు పారు గెడ్డలో నిలుచొని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైస్‌ఎంపీపీ భాగ్యవతి మాట్లాడుతూ జోడిగుమ్మ నుంచి అర్లాయిపుట్టు మీదగా గొబ్బరపడ గ్రామం వరకు 18కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయిన రహదారి ఊసే పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు. దీంతో రెండు గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో రెండు గ్రామాల గిరిజనులతో మండల కేంద్రంలో ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు సోమన్న, బాలరాజు, రోతోన్, సోనయి, భీమన్న, కొండయ్య, సోనాధర్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.